ఆప‌ద‌లో అండ‌గా నిలిచిన స‌ఖి

మంచిర్యాల : అంద‌రు ఉన్నా అనాథ అయ్యింది… ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోవ‌డంతో ప‌ట్టించుకునే దిక్కే లేకుండా పోయింది.. అలాంటి ఓ మ‌హిళ‌కు తానున్నాన‌ని నిలిచింది స‌ఖి…

మంచిర్యాల రైల్వే స్టేష‌న్‌లో దిక్కుతోచ‌ని స్థితిలో ఓ మ‌హిళ ఏడుస్తూ కూర్చుంది. క‌నీసం న‌డ‌టానికి కూడా ఇబ్బందిప‌డుతున్న ఈమెను చూసి స‌ఖి కేంద్రానికి స‌మ‌చారం అందించారు. దీంతో స‌ఖి కేంద్రం టీం రైల్వే స్టేష‌న్ వెళ్లి ఆ మ‌హిళ వివ‌రాలు సేక‌రించింది. కొత్త‌గూడెం స‌మీపంలోని రామ‌వరానికి చెందిన సింధూకి ఏడాదిన్న‌ర కింద‌ట వివాహం అయ్యింది. కొద్ది రోజుల కింద‌ట ఆమెకు ఆరోగ్యం బాలేక‌పోవ‌డంతో ఆసుప‌త్రికి వెళ్తే ర‌క్తం త‌క్కువ ఉంద‌ని ర‌క్తం ఎక్కించారు. ర‌క్తం ఇన్‌ఫెక్ష‌న్ అవ‌డంతో తన రెండు కాళ్ళు, ఏడమ చెయ్యి పని చేయటం లేదు. దాదాపు నెల రోజులు హాస్పిటల్ లోనే ఉంది. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి బాలేక‌పోవ‌డంతో ఆమె భ‌ర్త ఆమెని వ‌దిలేసి వెళ్లాడు. త‌ల్లిదండ్రులు లేక‌పోవ‌డంతో త‌మ్ముడి సాయంతో మంచిర్యాల‌లో ఉంటున్న చెల్లెలు ఇంటికి వ‌చ్చింది.

అయితే, చెల్లెలు కూడా త‌న వ‌ద్ద ఉంచుకునేందుకు నిరాక‌రించింది. దీంతో సింధు త‌మ్ముడు సైతం ఆమెను మంచిర్యాల రైల్వేస్టేష‌న్‌లో వ‌దిలేసి వెళ్లాడు. త‌న‌కు ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ఇక్క‌డే ఏడుస్తూ కూర్చున్నాన‌ని వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో స‌ఖి కేంద్రం సిబ్బంది ఆమెను మంచిర్యాల ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చేర్పించారు. స‌ఖి నిర్వాహ‌కురాలు శ్రీ‌ల‌త‌,లీగ‌ల్ అడ్వైజ‌ర్ శైల‌జ‌,సోష‌ల్ కౌన్సిల‌ర్ విజ‌య‌,సిబ్బంది వ‌సంత‌,శ్రీ‌కాంత్,రైల్వే పోలీస్ మ‌హేష్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like