బిగ్ బ్రేకింగ్‌… ఆదివాసీ మ‌హిళ‌ల‌కు బెయిల్

-బెయిల్ పేపర్స్ తీసుకొని వచ్చిన కాంగ్రెస్ నేత‌లు
- అన్యాయంగా అరెస్టు చేశార‌ని ఆరోప‌ణ‌
- కంట‌త‌డి పెట్టిన ఆదివాసీ మ‌హిళ‌లు

ఆదిలాబాద్ : జిల్లా జైల్ లో ఉన్న ఆదివాసీ మహిళలకు ఎట్ట‌కేల‌కు బెయిల్ మంజూరయ్యింది. కాంగ్రెస్ పార్టీ నేత‌లు వారికి బెయిల్ పేప‌ర్లు తీసుకువ‌చ్చారు. దీంతో వారు జిల్లా జైలు నుంచి విడుద‌ల అయ్యారు. పోడు భూముల కేసులో దండే పల్లి మండలం కొయ పోష గూడెం కు చెందిన 12 మంది ఆదివాసీ మహిళలను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. వారి విడుద‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌, ఆదిలాబాద్ నేత గండ్ర‌త్ సుజాత వారికి కండువాలు క‌ప్పి స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌లు మాట్లాడుతూ చంటి పిల్ల‌ల త‌ల్లులు అని చూడ‌కుండా అరెస్టులు చేయ‌డం ఏమిట‌ని మండిప‌డ్డారు. కేవ‌లం పుల్ల‌లు ఏరేందుకు వెళ్తే అరెస్టు చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసారని, అటవీ శాఖ అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లాక్కెళ్లారు… బూతులు తిట్టారు..
విడుద‌లైన ఆదివాసీ మ‌హిళ‌లు విలేక‌రుల‌తో మాట్లాడారు. త‌మ‌కు పాలు తాగే పిల్ల‌లు ఉన్నారని చెప్పినాప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నెట్టుకుంటూ లాక్కెళ్లార‌ని, మహిళ లు అని చూడకుండా బూతులు తిట్టారని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. మా చంటి పిల్ల‌లు ఇంట్లో… మేం జైలులో ఉన్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌కు భూమే ఆధారమ‌ని.. పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.

అర్ధ‌రాత్రి అక్ర‌మ అరెస్టులు…
వానాకాలం సాగు కోసం పోడుభూముల్లో తుప్పలు. తొలగించేందుకు వెళ్లిన 12 మంది గిరిజన మహిళలపై గ‌త బుధ‌వారం రోజున ఫారెస్టు ఆఫీసర్లు కేసులు పెట్టి జైలుకు పంపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట పరిధి కోయపోచగూడ గిరిజనులు కవ్వాల్టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి అక్రమంగా, ఆయుధాలతో ప్రవేశించారని, చెట్లు నరికి అటవీ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని అధికారులు కేసులు పెట్టారు. అదే రోజు లక్సెట్టిపేట కోర్టులో హాజరుపర్చారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అర్ధరాత్రి వారిని అదిలాబాద్‌ తరలించారు.

ఆందోళ‌న‌ల ప‌ర్వం…
ఆదివాసీ మ‌హిళ‌ల‌పై కేసులు పెట్ట‌డంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న‌లు సాగించింది. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావు ఆధ్వ‌ర్యంలో కోయ‌పోష‌గూడ గిరిజ‌న కుటుంబాల‌కు భరోసా క‌ల్పించారు. ఆ గ్రామంలో వారికి నిత్యావ‌స‌ర స‌రుకులు అందించారు. వారికి న్యాయం సాయం కూడా అందిస్తామ‌ని వెల్ల‌డించారు. ఇక ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌, కాంగ్రెస్ నాయ‌కులు ఆదిలాబాద్ జిల్లా జైలుకు వెళ్లి వారిని ప‌రామ‌ర్శించారు. నిర్మ‌ల్ జిల్లాలో ఏఐసీసీ కార్య‌క్ర‌మాల అమ‌లు క‌మిటీ చైర్మ‌న్ ఏలేటీ మ‌హేశ్వ‌ర్ రెడ్డి సైతం క‌లెక్ట‌రేట్ ఎదుట ఆందోల‌న నిర్వ‌హించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like