అధైర్య‌ప‌డ‌కండి.. అండ‌గా ఉంటాం…

-బీడీ కార్మికుల‌కు హామీ ఇచ్చిన బండి సంజ‌య్‌
-5వ రోజు జోరుగా కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
-కాషాయ జెండాలు చేతపట్టి కదం తొక్కుతున్న గిరిజనులు

Bandi Sanjay Bharosa for beedi workers: మీరు అధైర్య‌ప‌డ‌కండి మీకు అండ‌గా ఉంటామ‌ని బండి సంజ‌య్ బీడీ కార్మికుల‌కు హామీ ఇచ్చారు. ఆయ‌న పాద‌యాత్ర‌లో భాగంగా శుక్ర‌వారం బాంనీ గ్రామంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట్లో బీడీలు చుడుతున్న కార్మికులను చూసి, వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు కార్మికులు ‘బీడీ కార్మికులకు వచ్చే పెన్షన్’ రావడం లేదని బండి సంజయ్ దృష్టికి తీసుకువ‌చ్చారు. మేం వెయ్యి బీడీలు చుడితే… మాకు వచ్చే కూలీ రూ. 200 మాత్రమేన‌ని స్ప‌ష్టం చేశారు. ఆ వెయ్యి బీడీ లు చుట్టాలంటే.. కనీసం 2 రోజుల సమయం పడుతుంది సార్ అంటూ ఆయ‌న ముందు త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. మా కష్టాన్ని గుర్తించి, మాకు కూడా బీడీ కార్మికులకు వచ్చే ‘పెన్షన్’ ను ఇప్పించండి సార్ అని వేడుకున్నారు. దీంతో వారితో మాట్లాడిన బండి సంజ‌య్ మీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. బీడీ కార్మికులకు బీజేపీ తప్పకుండా అండగా ఉంటుంద‌న్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేన‌ని, అధికారంలోకి వచ్చాక తప్పకుండా అందరికీ న్యాయం చేస్తామ‌న్నారు.

మహిళా వితంతు రైతుకు బండి భరోసా
బీజేపీ అధికారంలోకి రాగానే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతోపాటు రైతు బీమాను కూడా అందజేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. పంట నష్టపరిహారంతో పాటు రైతు బీమా అందని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. శుక్ర‌వారం ఉదయం ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటి తండాకు చెందిన భ‌ర్త‌ను కోల్పోయిన రైతు శ్యాముకాబాయి తన గోడు వెళ్ళబోసుకున్నారు. తన భర్త రాథోడ్ రవీందర్ ఈ ఏడాది జూలై 25న మరణించాడని తెలిపారు. తనకు 2 ఎకరాల పట్టా భూమి ఉన్నా ‘రైతు బంధు’ రావడం లేదని వాపోయారు. పట్టా ఉన్నా ఆన్లైన్లో మాత్రం త‌మ‌ భూమిని చూపించడం లేదని తెలిపారు. దీంతో భర్త చనిపోయి 5 నెలలు గడిచినా ఇంతవరకు ‘రైతు బీమా’ కూడా అందలేదన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయినప్పటికీ పరిహారం కూడా అందలేదన్నారు. అధికారులు, ఎమ్మెల్యే చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. చాలా పేదదాన్ని నేను… నా కుటుంబాన్ని ఆదుకోండి సారూ.. ‘రైతుబంధు’, ‘రైతు బీమా’ వచ్చేలా… మీరే చూడాలి సారూ అని ప్రాథేయపడ్డారు.

వెంటనే స్పందించిన బండి సంజయ్ ‘‘అమ్మా… మీరేం బాధపకండి.. మీకు అండగా మేమున్నాం. మీ తరపున బీజేపీ పోరాడుతుంది. మీకు రైతు బీమా, రైతు బంధు, పంట నష్టపరిహారం’ అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా’’అంటూ భరోసా ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే… రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని… తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా రైతు బీమా, రైతు బంధు, పంట నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like