ఇక ధ‌ర్మ‌గుండంలోనే స్నానాలు

-వేముల‌వాడ‌లో నుంచి తెరుచుకోనున్న కోనేరు
-రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా మూత‌ప‌డిన ధర్మగుండం
-ఈనెల 4న పునః ప్రారంభానికి మూహుర్తం

Vemulawada Rajanna Temple: రాజ‌న్న భ‌క్తులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కోనేరు స్నానాల క‌ల ఈ నెల నాలుగు నుంచి నెర‌వేర‌నుంది. దాదాపు రెండేళ్లుగా ఈ ధ‌ర్మ‌గుండాన్ని మూసివేశారు. గురువారం రాజన్న ఆలయ ధర్మ గుండాన్ని, అందులోని మండపాలను, మెట్ల‌ను ఆల‌య సిబ్బంది, ఫైర్ సిబ్బంది క‌లిసి శుభ్రం చేశారు. ఈ నెల నాలుగు నుంచి దానిని పునఃప్రారంభించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో స‌న్నాహాలు చేశారు.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి మామూలు రోజుల్లోనే వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక శివరాత్రి, ఇతర ముఖ్యమైన పండుగల సమయంలో వీరి సంఖ్య లక్షలకు చేరుతుంది. చుట్టుపక్కల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవడానికి వస్తారు. అయితే ఇంత ప్రాముఖ్యం ఉన్న ఈ ఆలయంలోని కోనేరులో స్నానం చేయ‌కుండా అధికారులు దానిని మూసివేశారు. దాదాపు రెండేళ్లుగా స్నానం చేయడానికి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

కోవిడ్ కార‌ణంగా మూసివేత‌..
రెండున్న‌ర ఏండ్ల కింద‌ట కోవిడ్ పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన ధ‌ర్మ‌గుండం మూసివేశారు. కోవిడ్ త‌గ్గినా అధికారులు ధర్మగుండం వాడుకలోకి తీసుకురాక‌పోవడంతో భక్తులు ఇబ్బందులు ప‌డ్డారు. దీనిని తెరిపించాల‌ని చాలా మంది భ‌క్తుల నుంచి విజ్ఞ‌ప్తులు వ‌చ్చాయి. మొదటి వేవ్ ప్రారంభమైన 2020 మార్చి 20వ తారీఖున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధర్మగుండం పూర్తిగా మూసివేశారు. ప్రత్యేక ఉత్సవాల స‌మ‌యంలో మాత్రమే అది కూడా కేవలం కొద్ది మంది భక్తులకు మాత్రమే అందుబాటులో ఉంచి ఆ తర్వాత మూసి వేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఆలయంలోనూ లేనివిధంగా ఇక్కడి అధికారులు వ్యవహరిస్తుండడంతో సౌకర్యాల పట్ల స్థానికేతర భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్నానానికి నానా పాట్లు..
భ‌క్తులు వేముల‌వాడ‌లో స్నానానికి ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంది. ఆరు బయట ఉన్న కళ్యాణ కట్ట, వాహనాల పార్కింగ్ స్థలం , పార్వతిపురం నల్లాల వద్ద స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని భక్తులు తిరిగి వెళ్ళిపోతున్నారు. మగవారు ఎక్కడైనా స్నానాలు చేయగలరు కానీ యువతులు, మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్ర అసౌకర్యానికి గురైనా కూడా అధికారులు ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌కు ఈ నెల 4న ధ‌ర్మ‌గుండం పునఃప్రారంభం కానున్న నేప‌థ్యంలో భ‌క్తులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like