అన్నా తమ్ముడి పోరు…..? గెలిచేదెవరూ..?

--మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ గ్రూపు విభేదాలు
తమ అభ్యర్థినే ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే తాపత్రయం
-భట్టి పాదయాత్ర సాక్షిగా బయటపడిన వర్గపోరు

Congress: వాళ్లిద్దరూ అన్నా తమ్ముళ్లూ, ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకప్పుడు కలిసిమెలిసి తిరిగిన వారు ఇప్పుడు సై అంటే సై అంటున్నారు. తాము ప్రతిపాదించిన వ్యక్తినే ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు ఇద్దరూ వెనక్కి తగ్గడం లేదు.

ఇద్దరికీ ఎక్కడ చెడిందంటే…
ప్రేంసాగర్ రావు రాజకీయ ప్రస్థానం ఆసిఫాబాద్ నుంచే ప్రారంభం అయ్యింది. ఇక్కడ తన పట్టు నిలుపుకునేందుకు తమ్ముడు విశ్వప్రసాద్ రావుకు డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. రేవంత్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక విశ్వప్రసాద్ రేవంత్‌కు మద్దతు తెలిపారు. రేవంత్ అంటే గిట్టని ప్రేంసాగర్ రావు విశ్వప్రసాద్‌ను మందలించారు. దీంతో అన్న సహకారంతో వచ్చిన డీసీసీ పదవికి విశ్వప్రసాద్ రాజీనామా చేశారు. రేవంత్‌రెడ్డి ఆయన్ని పిలిచి తిరిగి ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పదవి విశ్వ ప్రసాద్‌కే కట్టబెట్టారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.

స్థానికురాలిని అభ్యర్థిగా..
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మర్సుకోల సరస్వతిని అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ ప్రతిపాదిస్తున్నారు. ఆమె స్థానికురాలు కావడంతో పాటు ఆమె తండ్రి రాజకీయ నేపథ్యం, స్వయంగా సరస్వతి కూడా రెండుమార్లు ఆసిఫాబాద్ పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందారు. ఆమె గిరిజన మహిళ కావడంతో పాటు జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మికి సోదరి కూడా. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోవలక్ష్మికి టిక్కెట్టు ఇస్తే ఆమెను ఓడించడం చాలా ఈజీ అనేది విశ్వప్రసాద్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదంతా ఒక్కెత్తు కాగా ఆమె స్థానికురాలు కావడం కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అంశమని ఆ వర్గం చెబుతోంది.

ఓటుబ్యాంకే శ్రీరామరక్ష..
అయితే, మరోవైపు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తమను గట్టెక్కిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో తమకు ఉన్న పరపతి సైతం కాపాడుతుందని గణేష్ రాథోడ్ అనే వ్యక్తిని రంగంలోకి దించారు. ఆయన అభ్యర్థిత్వంపై డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గణేష్ స్థానికుడు కాకపోవడం పార్టీకి మైనస్ అవుతుందని చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుతం గిరిజనులు, లంబాడాల మధ్య అంతర్యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలో లంబాడాకు చెందిన గణేష్ రాథోడ్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తే గిరిజనుల ఓట్లు దూరం అవుతాయని చెబుతున్నారు.

పట్టు విడవని అన్నా,తమ్ముడు..
ఇలా తమ వ్యక్తే ఎమ్మెల్యే కావాలనే తపనతో ఇద్దరు నేతలు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వ్యక్తికి టిక్కెట్టు ఇప్పించుకోవాలి… గెలిపించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య ప్రచ్ఛనయుద్దం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం భట్టి విక్రమార్క పాదయాత్ర సాక్షిగా అది కాస్తా రోడ్డెక్కింది. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు, నేతలు నినాదాలు ప్రతినినాదాలతో రహదారి మొత్తం దద్దరిల్లింది. ఒకానొక దశలో కొందరు కార్యకర్తలు ఏకంగా ప్రేంసాగర్ రావునే తోసేశారు. తన అభ్యర్థిని నిలబెట్టుకుంటానని ఎలాగైనా గెలిపించుకుంటానని ఆయన శపథం చేశారు.

మరి అన్నాదమ్ములు ఇద్దరు కలిసే అవకాశం ఉందా…? అధిష్టానం వారిని కలిపేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటుందా…? చివరకు ఆసిఫాబాద్ బరిలో కాంగ్రెస్ తరఫున నిలిచే అభ్యర్థి ఎవరూ..? అన్నదమ్ముల్లో గెలిచేదెవరూ..? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు. కొద్ది రోజులు ఆగితే కానీ వీటన్నింటికి సమాధానాలు దొరకవు..

Get real time updates directly on you device, subscribe now.

You might also like