చాకు ప‌ట్టుకుని చంపుతా అంటోంది..

-ఆ సీడీపీవోను స‌స్పెండ్ చేయండి
-శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాల‌యం ముందు అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, ఆయా బైఠాయింపు

సీడీపీవో సాదియారుక్సానాను వెంటనే స‌స్పెండ్ చేయాల‌ని ప‌లువురు అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, ఆయాలు డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళ‌నకు దిగారు. ఆసిఫాబాద్ ప్రాజెక్ట్ అధికారి ఆసిఫాబాద్ సిడిపిఓ సాదియారుక్సానా వచ్చినప్పటినుండి తమను వ్యక్తిగతంగా దూషిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చాకు పట్టుకొని చంపేస్తాను అంటూ బెదిరిస్తోంద‌న్నారు. ఏదైనా విష‌యంలో సీడీపీవో నేనా..? నువ్వా…? అంటూ అహంకారపూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. తాము ఎంత పని చేసినా చేస్త లేరంటూ ఇబ్బందుల‌కు గురిచేస్తున్న ఆమెను వెంటనే సస్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. హెడ్ ఆఫీస్ కి సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీరా ఆత్మరామ్ నాయక్ మ‌ద్ద‌తు తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ జీతాలు సరిగా రాకున్నా అంగ‌న్‌వాడీలు ప‌ని చేస్తున్నార‌ని చెప్పారు. కనీస వేతనాలు ఇవ్వక పని భారాన్ని పెంచి, దాడి జరిగినా పట్టించుకోకపోవ‌డం సిగ్గుచేట‌న్నారు. రెండు రోజుల నుంచి ఎండలో టెంటు వేసుకొని ధర్నా చేస్తుంటే ఏ ఒక్క అధికారి కూడా ఏమైంది అని అడిగే పరిస్థితి లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంట‌నే స్పందించి వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరగని పక్షంలో భారతీయ జనతాపార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి వారికి పూర్తిస్థాయిలో మద్దతిచ్చి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రాథోడ్ రవీందర్ సిఐటియు నాయకులు లోకేష్ తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like