కాంగ్రెస్‌… గ‌ప్‌చిప్‌..

ప్ర‌జాక్షేత్రంలో ఉండి వారి స‌మ‌స్య‌ల‌పై పోరాడాల్సిన ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మౌనం వహిస్తోంది. నేత‌లు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు గాలికి వ‌దిలేసి వారు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో ఆ పార్టీని జ‌నం మ‌ర్చిపోవాల్సిన ప‌రిస్థితి. ఈ మౌనం ఆత్మ‌హ‌త్యాస‌దృశ్య‌మ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ పోరాటం చేయాల్సి ఉండ‌గా ఆ పార్టీ నేత‌ల మౌనం వెన‌క అంత‌రార్థం ఏమిట‌నే దానిపై నాంది న్యూస్‌ ప్ర‌త్యేక క‌థ‌నం.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు సైలెంట్ అయ్యారు. మిగతా రెండు పార్టీలు రాజకీయ పోరాటాల్లో బిజీగా ఉన్నా హస్తం పార్టీ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు.. నాలుగు జిల్లాల అధ్యక్షులే కాదు నియోజకవర్గాల ఇంచార్జ్ లు సైతం జనం సమస్యలపై జరిగే పోరాటాల్లో ఎక్క‌డా కనిపించడం లేదు…. టిఆర్ఎస్, బిజెపి నేతలు నిత్యం వార్తల్లో ఉంటున్నా కాంగ్రెస్ లీడర్లు కనుచూపుమేరలో లేకుండా పోయారు. దీంతో అటు ద్వితీయ శ్రేణి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సైతం పార్టీ గురించి ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆ పార్టీ నుంచే వినిపిస్తోంది.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు ఒక రకంగా సైలెంట్ మోడు లోకి వెల్లిపోయారు. రైతుల సమస్యలు, ఉద్యోగుల పోరాటాలు, పోడు భూముల అంశాల పై నిత్యం ఎక్కడో ఒక్కచోట ఆందోళనలు జ‌రుగుతూనే ఉన్నాయి. బాధితులు త‌మ పోరాటాలు చేస్తూనే ఉన్నారు…. ఈ నిరసనల్లో వీలు దొరికినప్పుడల్లా బిజెపి, దానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోటాపోటీగా కొన్ని జిల్లాల్లో పోరాటం చేస్తున్నారు. ఇక ఉద్యోగుల సర్దుబాటు అంశం పెద్ద ఇష్యూ అవుతోంది. మ‌రి ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాత్ర పోషించాలి. స‌మ‌స్య‌ల‌ను ముందుకు తీసుకువెళ్లి బాధితుల ప‌క్షాన నిల‌బ‌డాలి. కానీ ఇలాంటి ముఖ్య‌మైన సమయంలో సైతం కాంగ్రెస్ నేతలు పత్తాలేకుండా పోయారు.

ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో బ‌దిలీ అంశం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ముఖ్యంగా టీచర్లు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు నిత్యం ఆందోళనలు చేస్తున్నారు… ఇదే అంశంపై ఏజెన్సీలో త‌మ‌కు హక్కులు అవకాశాలు పోతున్నాయని తుడుందెబ్బ జిల్లా బంద్ కు సైతం పిలుపునిచ్చింది. అందులో వివిధ సంఘాలు సైతం పాల్గొన్నాయి. ఉపాధ్యాయుల పోరాటంలో అక్కడక్కడ బిజెపి మద్దతు తెలిపింది. ఇక కాంగ్రెస్ మాత్రం ఎక్కడ కనిపించకపోవడంతో ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే అధికారానికి రెండు సార్లు దూర‌మైన కాంగ్రెస్ ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల్లోకి వెళితే త‌ప్ప వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆద‌రించే ప‌రిస్థితి ఉండ‌దు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో కాంగ్రెస్ మౌనం వెన‌క అర్దం ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. జనంలో కాంగ్రెస్ నేతలున్నారా..? అనే అభిప్రాయాలు వ్యక్తమ‌వుతున్నాయి.

ఇదంతా ఒక్కెత్తు కాగా, రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చినా… ఆ రోజు కాకుండా వేరే రోజు కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. అది కూడా నిరసనలకు బదులుగా కేవలం విజ్ఙాప‌న ప‌త్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ తీరును చూసిన జనం ఇదెక్కడి విచిత్రం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.. నేతలకు తీరితే పోరాటం …లేదంటే అంతే అన్నట్టుగా ఉంది అక్కడి యవ్వారం… డిసీసీ అధ్యక్షులుగా ఉన్న పటేల్ ముథోల్ నియోజకవర్గం తప్ప‌ ఎక్కడి వెల్లింది లేదని స్వ‌యంగా కార్య‌క‌ర్త‌లే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్ పార్టీలో ఎవ్వరున్నారో ఏమో అనే పరిస్థితి ఉంది.. ఆదిలాబాద్ లో చెప్పుకోవడానికి నేతలున్నా ఎక్కడ రోడ్లపై జరిగే పోరాటాల్లో కనిపించడం లేదు. కేవలం చిన్న చిన్న కార్యక్రమాలకు వెళ్ల‌డం ఫోటో దిగడం… బొకేలివ్వడం తప్ప ప్రజాపోరాటాల్లో కనిపించడం లేదు.. మంచిర్యాలలో కొక్కిరాల ప్రేంసాగ‌ర్ రావు హడావుడి చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అక్కడ సైతం ప్రెస్ మీట్లు , చిన్న చిన్న కార్యక్రమాలు తప్ప పోరాటం ముచ్చటే లేదు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలుండగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ, టీఆర్ఎస్ నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు, చిన్న చిన్నగా లేదంటే ధర్నాలు రాస్తారోకోలు. ఏదో ఒక్క సమస్యతో జనంలో ఉంటున్నారు. కాంగ్రెస్ దేన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం పార్టీ క్యాడర్ లో సైతం చర్చనీయాంశమైంది.. నిర్మల్ జిల్లాలో రేవంత్ టూర్, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి దండోరా తో కాస్త ఊపమీద కనిపించినా ఇప్పుడా పరిస్థితి లేదు. పార్టీ సభ్యత్వ ఒక‌టి, రెండు చోట్ల చురుకుగా సాగుతున్నా.. కొన్ని చోట్ల అది ఎక్కడ చేస్తున్నారో అదే పార్టీ క్యాడర్ కు తెలియకుండా పోయిందని స‌మాచారం. జిల్లాల అధ్యక్షుల పదవులు ఉన్న వారికే ఉంటాయా….? కొత్త వారికి ఇస్తారా…? అనే మీమాంసంలో ఎవ‌రూ పార్టీ బాధ్య‌త‌లు మీద వేసుకుని చేయ‌డం లేద‌ని ప‌లువురు చెబుతున్నారు. ఆ మధ్య‌ కాస్త స్పీడందుకుందనే అభిప్రాయం జనంలో వచ్చినా ఆ తర్వాత నెమ్మదించడంతో కాంగ్రెస్ పార్టీ ఇక అంతేనా… ఉమ్మ‌డి జిల్లాలో క‌నుమ‌రుగు అవుతుందా..? అనే అనుమానాలు సైతం వ్య‌క్తం అవుతున్నాయి.

ఏదైనా పోరాటానికి రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చినా అంతర్గత కుమ్ములాటలతో దానిని విజ‌య‌వంతం చేయ‌డం లేదు. ఆ కార్య‌క్ర‌మాల్లోనే పార్టీలో నేతల మ‌ధ్య‌ వర్గ విభేదాలు పొడచూపుతున్నాయి. ఇది పార్టీ తీరుకు అద్దం పడుతుందనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో నేతల్లో మార్పు సాధ్య‌మేనా.. అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. బీజేపీ,టీఆర్ఎస్ ఒకటి రాష్ట్రంలో.. ఇంకోటి కేంద్రంలో అధికారంలో ఉన్నాయి.. ఆ పార్టీలే ఏతావాత ఏదో రూపంలో ఆందోళనలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ గా ఉన్న కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లోపాలను అందిపుచ్చుకోని రెండు పార్టీలు లేదా ప్రభుత్వాలను ప్రజా సమస్యలపై ఎండగట్టాలి…? లేదా ఉద్యమాలు చేయాల్సి ఉండే.. ఇవ‌న్నీ కాకున్నా జ‌నం కోసం ఏదో ఒక్కటి చేయాల్సిన టైం లో ఇలా మౌనముద్రలో ఉండడం వెనక ఆంతర్యం ఏంటో అనే చర్చ మాత్రం సాగుతోంది.. ఈ మౌనం నేతల వ్యూహమా…..? లేక నిలదొక్కుకోకపోవడమా..? కారణం ఏంటి అనేది పార్టీ నేతలకు తెలియాలి.. రాష్ట్ర పార్టీ సైతం ఉమ్మడి జిల్లా నేతలను లైట్ తీసుకుంటుందా.. లేక గాలికి వదిలేసిందా…గాడిలో పెడుతుందో లేదో చూడాలి మరీ.

Get real time updates directly on you device, subscribe now.

You might also like