దండె విఠ‌ల్ గెలిచిండు…

ఆదిలాబాద్ – ఆదిలాబాద్ ఉమ్మ‌డి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో దండె విఠ‌ల్ ఘ‌న విజ‌యం సాధించారు. అనుమానాలు ప‌టాపంచ‌లు చేస్తూ భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నారు. మొత్తం 860 ఓట్లు పోలు కాగా, రెండు పోస్ట‌ల్ బ్యాలెట్ వ‌చ్చాయి. ఇందులో చెల్లిన ఓట్లు 815 ఉన్నాయి. దండేవిఠ‌ల్‌కు 742 ఓట్లు రాగా, స్వ‌తంత్ర అభ్య‌ర్థికి కేవ‌లం 75 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇందులో చెల్ల‌నివి 45 ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్య‌ర్థి విఠ‌ల్ 667 ఓట్ల మెజారిటీ సాధించారు.

అనుమానాలు ప‌టాపంచ‌లు..
వాస్త‌వానికి అన్ని ర‌కాలుగా టీఆర్ఎస్‌కే బ‌లం ఉన్న‌ప్ప‌టికీ గెలుస్తారో..? లేదో.,? అని అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. టిక్కెట్టు ద‌క్క‌ని నేత‌లు, స్థానిక నేత‌లు పుట్టి ముంచుతారా అనే భ‌యం వెన్నాడింది. నామినేష‌న్ల విత్ డ్రా స‌మ‌యం నుంచి ఎన్నిక వ‌ర‌కు హైడ్రామా న‌డిచింది. మ‌రోవైపు ఎంపీటీసీలు సైతం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్నార‌నే సంకేతాలు సైతం ఆ పార్టీ అభ్య‌ర్థి విఠ‌ల్ గెలుపును ప్ర‌భావితం చేస్తాయోమెన‌ని ప్ర‌చారం సైతం జ‌రిగింది. ఇలా ఎన్నో ర‌కాలైన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న గెలుపుపై సందేహాలు వ్య‌క్తం అయ్యాయి.

మ‌హిళా స్వ‌తంత్ర అభ్య‌ర్థి ప్ర‌భావం అంతంతే…
అధికార పార్టీకి వ్య‌తిరేకంగా పోటీ చేసిన‌ పెందూరు పుష్పారాణి అధికార పార్టీకి పెద్ద స‌వాల్‌గా మారుతుంద‌ని భావించారు. ఆమె ఆదివాసీ మ‌హిళ కావ‌డంతో ఆమెకు వ్య‌తిరేకంగా ఎవ‌రూ మాట్ల‌డ‌లేదు కూడా. మొద‌ట ఆమెను విత్ డ్రా చేయించేందుకు ప్ర‌య‌త్నించిన అధికార పార్టీ ఆ విష‌యంలో పూర్తిగా విఫ‌లం అయ్యింది. ఒకానొక ద‌శ‌లో ఆమెకు అనుకూలంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మాట్లాడాయి. అంతేకాకుండా ఆదివాసీ ఓట‌ర్లు ఏ పార్టీలో ఉన్నా ఆమెకే ఓటేస్తార‌ని ప్ర‌చారం సాగింది. అయితే ఆమె ప్ర‌భావం ఈ ఎన్నిక‌ల్లో పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like