ప‌నుల్లో వేగం పెంచండి

అధికారుల‌కు ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ఆదేశాలు

Government Whip Suman wants to speed up the work: చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న పనుల్లో వేగం పెంచాలని అధికారుల‌కు ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ఆదేశాలు జారీ చేశారు. క్యాతనపల్లిలోని ఎమ్మెల్యే స్వగృహంలో అధికారుల‌తో ఆయ‌న స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వర్షాకాలం లోపు పెండింగ్ పనులన్నీ పూర్తయ్యలా కార్యచరణ రూపొందించుకొని పనిచేయాలన్నారు. కొనసాగుతున్న పనులతో పాటు కొత్తగా నిర్మించాల్సిన వాటిపై అధికారులు జాబితా రూపొందించాలన్నారు. అవసరమున్న ప్రతి చోట హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలని వెల్ల‌డించారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అటవీ అనుమతులు, కొత్తగా నిర్మించాల్సిన బ్రిడ్జిలు రోడ్లకు సంబంధించి త్వరలోనే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

గ్రామ, మండల, మున్సిపాలిటీలలో మిషన్ భగీరథ పనులను ఈ నెలాఖరి కల్లా పూర్తి చేయాలని బాల్క సుమ‌న్ ఈ సంద‌ర్బంగా అధికారులను ఆదేశించారు. మిగిలిఉన్న ఇంట్రాగ్రేట్ పనులను, లీకేజీలు రిపేర్ లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల్లో భాగంగా తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వ్యవస్థలన్నింటినీ స‌క్ర‌మంగా ఉండేలా చూడాల‌న్నారు. ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు, నర్సరీలు, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ప్రజలు వినియోగించుకునేలా అధికారులు చొరవ చూపాలని కోరారు.

పల్లె ప్రకృతి వనంలో చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్స్, క్రీడా ప్రాంగణాల్లో వీలైతే క్రికెట్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలని వారికి సూచించారు. మహిళా భవన్, లైబ్రరీలకు స్థల పరిశీలన వీలైనంత త్వరలో పూర్తి చేయాలన్నారు. తాను గ్రామాల్లో పర్యటించే సందర్భంలో స్ట్రీట్ లైట్ కమిటీ, వర్క్స్ కమిటీ, శానిటేషన్ కమిటీ, హరితహారం కమిటీలతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఉండాలని స్ప‌ష్టం చేశారు. ప్రతి వారం, పది రోజులకు ఒకసారి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిపై చర్చిస్తామ‌ని అన్ని నివేదిక‌ల‌తో సిద్ధంగా ఉండాల‌న్నారు. అన్ని శాఖల ప్రభుత్వాధికారులు సమన్వయతో పనిచేసి పనులు వేగవంతం అయ్యేలా కృషి చేయాలని విప్ బాల్క సుమ‌న్ అధికారులకు సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like