హిజాబ్ నిషేధాన్ని సమర్థించిన హైకోర్టు..

అన్ని పిటిషన్లు కొట్టివేత

విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ వేసుకోవ‌ద్ద‌నే వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. విద్యా సంస్థల్లో మత పరమైన ఆచారాలను పాటించడం తప్పనిసరి కాదని హైకోర్టు విస్తృత ధర్మాసనం వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ రితూ రాజ్ అవస్థి నేతృత్వంలో జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎస్ ఖాజీలతో కూడిన ధర్మానం ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది.

‘ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతపరమైన ఆచారంలో భాగం కాదు. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించడం సహేతుకమైన పరిమితి మాత్రమే, దీనిని విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరు. యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది’ అని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, పిటిషన్లు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశాలున్నాయి.

హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా కర్ణాటక ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. చీఫ్ జస్టిస్ అవస్థి ఇంటితోపాటు కేసుతో సంబంధమున్న అందరు జడ్జిల ఇళ్ల వద్ద భద్రత పెంచారు. నిరసన కార్యక్రమాలు జరగకుండా బెంగళూరుతోపాటు కీలక నగరాలు, పట్టణాల్లో ఆంక్షలు విదించిది. బెంగళూరులో మార్చి 15వతేదీ నుంచి వారం రోజులపాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144ని విధించారు. తీర్పు నేపథ్యంలో ఇవాళ మంగళూరు, శివమొగ్గలో అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసేశారు. కబురగి, దావణగెరె, బెల్గాం, కొప్పల్, గడగ్, హాసన్ జిల్లాల్లో కూడా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.

హైకోర్టు తీర్పు వెలువడటానికి కొద్ది నిమిషాల ముందు కూడా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై రాష్ట్రంలో శాంతిభద్రతలపై హోం మంత్రితో చర్చించారు. విద్యా సంస్థల్లో హిజాబ్ ను నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగానే కోర్టు వచ్చిన దరిమిలా సీఎం బొమ్మై తదుపరి నిర్ణయాలు కీలకం కానున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like