కేసీఆర్ అభినవ అంబేద్క‌ర్

-తెలంగాణ‌లో బ‌డుగు జాతికి న‌వోద‌యం
-ఇలాంటి ప‌థ‌కం ప్ర‌పంచంలోనే మొద‌టిది
-ముఖ్య‌మంత్రికి తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున మ‌రోమారు కృత‌జ్ఞ‌త‌లు

మంచిర్యాల : ముఖ్య‌మంత్రి కేసీఆర్ అభిన‌వ అంబేద్క‌ర్ అని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో దళిత బంధు ద్వారా లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు తెలంగాణలో బడుగు జాతికి నవోదయం మొదలైందన్నారు. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందిస్తూ 10 లక్షల రూపాయలను అందించడం బహుశా ప్రపంచ చరిత్రలో తొలిసారని స్ప‌ష్టం చేశారు. దళిత ముద్దుబిడ్డ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమ‌న్నారు. దళితుడిని ధనికుడిని చేసే పథకం దళిత బంధు అని కొనియాడారు. అణ‌గారిన వర్గాలకు ఆర్ధిక తోడ్పాటును అందిస్తూ, ద‌ళిత జాతి స్వశక్తితో, ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో “తెలంగాణకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన” అభినవ అంబేద్కర్ కేసీఆర్ కి దళిత సమాజం తరపున, మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.
స్వతంత్ర భారతావనిలో బ‌తుకు కోసం, స్వేచ్ఛ కోసం పోరాడే జాతి ఏదైనా ఉంది అంటే అది ఒక దళిత జాతే అని బాల్క సుమ‌న్ వెల్ల‌డించారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టి ఏకంగా దళిత జాతి అస్తిత్వానికే తిరిగి ప్రాణం పోశారని అన్నారు. దళితులను ఓటు బ్యాంకుగా చూసి వారి కుతంత్రాలు, వ్యూహాలలో బలిపశువులను చేశారు గానీ ఎన్నడూ వారి అభ్యున్నతి కోసం పాటుపడింది లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల వెలుగులో ఊపిరి పోసుకున్న దళిత బంధు ద్వారా వారి జీవితాల్లో నేడు ప్రగతి వెలుగులు ప్రసరిస్తున్నాయ‌ని అన్నారు.

ద‌ళితులు అవమానాలను దిగమింగి, అభివృద్ధి వైపు ప్రయాణించాలంటే.. ఆర్థిక పరిపక్వత చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్ప‌ష్టం చేశారు. దళిత బంధు పథకం ద్వారా నాటి కూలీలే నేడు ఓనర్లు గా మారుతున్న సందర్భాలున్నాయి. త్వరలోనే జిల్లాలో నియోజకవర్గానికి 1500 మందిని ఎంపిక చేసి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్ రావు, దుర్గం చిన్న‌య్య, జ‌డ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి , ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, జిల్లా కలెక్టర్ భార‌తీ హోళీకేరీ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like