కొనుగోలు కేంద్రాల్లో అన్న‌దాత గోస

-వాన‌కు త‌డుస్తూ.. ఎండ‌కు ఎండుతున్న వైనం
-అప్పు ఇచ్చిన వారు ఆగ‌నివ్వ‌క‌పోవ‌డంతో ఆందోళ‌న‌
-దిక్కుతోచ‌ని ప్రైవేటుకు తెగ‌న‌మ్ముకుంటున్న రైతులు

మంచిర్యాల : ఒక్క గింజ కూడా పోకుండా కొనుగోలు చేస్తాం.. ఇది మంత్రి ప్ర‌క‌ట‌న‌.. రైతుల‌కు ఇబ్బందులు లేకుండా ర‌వాణా వ్య‌వ‌స్థ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తాం… ఇది క‌లెక్ట‌ర్ హామీ… ఇవి చూడ‌గానే నిజ‌మే అనిపిస్తుంది… కానీ క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతోంది వేరేలా ఉంది…

ఆరుగాలం శ్రమించిన పండించిన పంట అమ్ముకోవడానికి రైతులకు గోస తప్పడం లేదు. రోజుల తరబడి రైతులు ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాలకు వరదనీటితో ధాన్యం తడవడం, ఆరబెట్టుకుంటూ అనేక వ్యయప్రయాసలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ కొనుడు మాత్రం మరిచారు.

నెన్న‌ల మండ‌లం గొల్ల‌ప‌ల్లిలో ఐకేపీ ఆధ్వ‌ర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సెంట‌ర్ ప్రారంభించి దాదాపు 15 రోజుల‌పైనే అవుతోంది. ఇక్క‌డ‌కు మైలారం, గొల్ల‌ప‌ల్లి, దుబ్బ‌ప‌ల్లికి చెందిన రైతులు ధాన్యం తీసుకువ‌చ్చి అమ్ముకుంటున్నారు. అయితే ఈ కేంద్రానికి ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఆరు లారీలు మాత్రమే వ‌చ్చాయి. వారం రోజులుగా ర‌వాణాప‌రంగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో రైతుల ధాన్యం అలాగే ఉండిపోయింది.

ధాన్యం కాంటా చేసి ఐదురోజులు అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండుమార్లు వ‌ర్షాలు ప‌డ్డాయి. దీంతో రైతులు త‌డిచిన ధాన్యం ఆర‌బెట్టుకోవ‌డం, మ‌ళ్లీ త‌డిస్తే మ‌ళ్లీ ఆర‌బెట్టుకోవ‌డం ఇదే ప‌రిస్థితిలా మారింది. దీంతో కొంటారో.. కొన‌రో అనే ఉద్దేశంతో ప్రైవేటు మార్కెటుకు త‌ర‌లిస్తున్నారు. ఇక్క‌డి నుంచి చెన్నూరుకు సొంత డ‌బ్బుల‌తో ధాన్యం తీసుకువెళ్తున్నారు. దీంతో ర‌వాణా చార్జీలు సైతం న‌ష్ట‌పోతున్నారు. అదే స‌మ‌యంలో, అక్క‌డ క్వింటాల్ కేవ‌లం రూ. 1500కు అమ్మేస్తున్నారు.

ఇక్క‌డ ఇంకా ఐదు లారీల వ‌ర‌కు ధాన్యం నిలువ ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువ ఉంద‌ని, త‌మ‌కు లారీ పంపించ‌మ‌ని నెన్న‌ల త‌హసీల్దార్ భూమేశ్వ‌ర్‌కు ఫోన్ చేస్తే నిర్ల‌క్ష్యంగా స‌మాధానం చెబుతున్నార‌ని ప‌లువురు రైతులు నాందిన్యూస్‌తో త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు. మూడు రోజులుగా ఇప్పుడు పంపుతా, రేపు పంపుతా అంటూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రి ఇప్ప‌టికైనా అధికారులు మేలుకొంటారో లేదో వేచి చూడాల్సిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like