దేశం కోసం ఏఐ కౌన్సిల్ కావాలి..

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) యావత్ ప్రపంచాన్ని తీవ్ర ప్రభావం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో “ఏఐ కౌన్సిల్” ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ముఖ్యమంత్రి కీలకోపన్యాసం చేశారు. జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక “ఏఐ మంత్రిత్వ శాఖ” ఏర్పాటు చేయాలన్నారు. భారత ప్రభుత్వ సహకారంతో దేశానికి ఒక “ఏఐ స్టార్టప్ విలేజ్” ఏర్పాటు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

ఏఐలో శరవేగంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి నిరంతరం అభివృద్ధిని పర్యవేక్షించే “జాతీయ ఏఐ వార్‌రూమ్” ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. కేంద్రం అనుమతిస్తే అందుకు హైదరాబాద్ కేంద్రంగా వార్‌రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏఐ పురోగతిలో తెలంగాణతో భాగస్వామ్యం కావాలని ప్రపంచ నాయకులు, సాంకేతిక నిపుణులకు ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు. వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో ఏఐకి సంబంధించి ప్రతి ఏటా ఒక్కసారి జరిగే చర్చలు సరిపోవని పేర్కొంటూ, దేశంలోని వివిధ నగరాలలో సంవత్సరానికి రెండుసార్లు ఏఐ సమ్మిట్‌లు నిర్వహించాలని రేవంత్‌ ప్రతిపాదించారు.

GPU చిప్ తయారీ, గ్రీన్ ఎనర్జీ, డేటా స్టోరేజీ, కోర్ లాంగ్వేజెస్ ఆధారిత సేవల వరకు ఏఐ చైన్ మొత్తం మీద భారతదేశం నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోకుండా, మరిన్ని అవకాశాలు సృష్టించేలా సమగ్ర రీ-స్కిల్లింగ్ వ్యూహాలు అమలు చేయాలన్నారు. కొన్ని దేశాల్లో ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సేవల రంగంలో దేశం పురోగతి సాధించినా, ప్రపంచ స్థాయి ప్లాట్‌ఫార్మ్‌ల సృష్టికర్తగా నిలబడలేకపోయామని, ప్లాట్‌ఫార్మ్‌లకు సేవలందించే దేశంగా మాత్రమే నిలిచామని పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like