తెలంగాణకు గర్వకారణం
-త్వరలో దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ ప్రారంభం
-ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : లోకోమోటివ్స్ కోసం హైటెక్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ చేసి తయారు చేసే మేధా సర్వో డ్రైవ్స్ తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలోని కొండకల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. మేధా గ్రూప్చే ఏర్పాటు చేసిన ఈ అతిపెద్ద ప్రైవేట్ రైలు కోచ్ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీలలో ఒకటైన మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ప్రారంభం కానుండడం గర్వకారణంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు మంత్రి ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. రెండేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా కొడంకల్లో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. భూమిపూజ చేసిన దగ్గరి నుంచి నిర్మాణ పనులను మేధా సంస్థ వేగంగా పూర్తిచేసుకుంది.
రెండు వేల మందికి ఉపాధి…
సుమారు 1000 కోట్లతో మేధా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల సుమారు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. రైల్ కోచ్లు, మెట్రో కోచ్లు ఇక్కడ తయారు చేయనున్నారు. రైలు కోచ్ ఫ్యాక్టరీ వల్ల 2200 మందికి ఉపాధి అవకాశాన్ని లభిస్తాయని తెలంగాణ ప్రభుత్వం గతంలో ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో కోచ్లు, లోకోమోటివ్స్, ఇంటర్ సిటీ రైలుసెట్లు, మెట్రో రైళ్లు, మోనోరైల్ వంటి వాటికి సంబంధించినవి తయారు చేయనున్నారు. ప్రస్తుత ఇన్ స్టాల్ చేసిన ప్రొడక్షన్ కెపాసిటీ సంవత్సరానికి 500 కోచ్లు, 50 లోకోమోటివ్స్ తయారు చేయనున్నారు.