లొల్లి ఆగ‌దు.. చేయి క‌ల‌వ‌దు..

-గొడ‌వ‌లు, గ్రూపుల‌కు కేరాఫ్‌గా కాంగ్రెస్ పార్టీ
-త‌మ‌కు స‌రైన ప్రాతినిథ్యం క‌ల్పించ‌డం లేద‌ని ఆవేద‌న
-జిల్లా కాంగ్రెస్ క‌మిటీని గుర్తించ‌మ‌ని అస‌మ్మ‌తి నేత‌ల ఆందోళ‌న‌
-కొత్త డీసీసీ ఏర్పాటు చేసుకుంటామ‌ని హెచ్చ‌రిక‌

Manchryala is the circle of groups in the Congress party: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌(Congress)లో గొడ‌వ‌లు ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌నిగేలా లేవు. రోజురోజుకి తారాస్థాయికి చేరుకుంటున్నాయి త‌ప్ప అవి స‌మ‌సిపోయే సంద‌ర్భం క‌నిపించ‌డం లేదు. అధిష్టానం స్వ‌యంగా జోక్యం చేసుకుంటే త‌ప్ప అవి కొలిక్కి రావ‌ని ఏకంగా పార్టీ నాయ‌కులే చెబుతున్నారంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక ఏఐసీసీ స‌భ్యుడు ప్రేంసాగ‌ర్‌రావు, ఆయన భార్య డీసీసీ అధ్య‌క్షురాలు సురేఖపై వారు అస్త్రాలు సంధిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు త‌గాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఆ పార్టీ గ్రూపులు, గొడ‌వ‌ల‌కు కేంద్రంగా మారిందంటే ఆశ్చ‌ర్యం లేదు. కొద్ది రోజులుగా జ‌రుగుతున్న గొడ‌వ‌ల‌కు తోడు తాజాగా ఆదివారం సాయంత్రం జ‌రిగిన గొడ‌వ మ‌రింత అగ్గిని రాజేసింది. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి కొంద‌రు నేత‌ల‌కు మాత్ర‌మే ఆహ్వానం అందింది. పార్టీలో కొత్త‌గా చేరిన జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మి, ఆమె భ‌ర్త మాజీ ఎమ్మెల్యే ఓదెలు, మాజీ మంత్రి బోడ జ‌నార్ద‌న్ త‌దిత‌రులు ఎవ‌రికీ ఆహ్వానం పంపించ‌లేదు. దీంతో ఆ స‌మావేశాన్ని బహిష్క‌రిస్తున్న‌ట్లు మాజీ మంత్రి బోడ జ‌నార్ద‌న్ ప్ర‌క‌టించారు. జిల్లా క‌మిటీ విష‌యంలో తాము అధిష్టానికి ఫిర్యాదు చేశామ‌ని ఆ క‌మిటీని పెండింగ్‌లో ఉంచార‌ని తెలిపారు.

ఇక న‌ల్లాల ఓదెలు స‌మావేశానికి వెళ్లినా ప‌రోక్షంగా వారిని వెళ్లిపోమ‌ని మైక్‌లో చెప్ప‌డంతో వారు స‌మావేశం బ‌య‌టికి వెళ్లారు. అక్క‌డ విలేక‌రుల‌తో మాట్లాడుతూ తాను దళితుణ్ణి కాబట్టే వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి తనను ఆహ్వానించలేదని గాంధీభవన్ కు చెబితే వాళ్ళు ఆహ్వానం పంపించారని అన్నారు. సమావేశానికి వచ్చిన తనను AICC సెక్రటరీ రోహిత్ చౌదరి సాక్షిగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశ సభను బైకాట్ చేస్తున్నట్లు నల్లాల ఓదెలు ప్రకటించారు. ఇక చెన్నూరులో త‌మ‌కు ఇబ్బందులు సృష్టించేందుకు కొంద‌రు వ్య‌క్తుల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

ఇక ప్రేంసాగ‌ర్ రావు టార్గెట్‌గా అస‌మ్మ‌తి నేత‌లు పావులు క‌దుపుతున్నారు. చెన్నూరు, బెల్లంప‌ల్లిలోని అస‌మ్మ‌తి నేత‌లు అంతా క‌లిసి అధిష్టానికి ఫిర్యాదు చేయ‌నున్నారు. వాస్త‌వానికి సోమ‌వారం ఉద‌య‌మే పార్టీ సీనియ‌ర్ ఉపాధ్య‌క్షుడు నిరంజ‌న్‌ను జ‌గిత్యాల‌లో క‌లిసి ఫిర్యాదు చేసేందుకు బోడ జ‌నార్ద‌న్ సిద్ధ‌మ‌య్యారు. కానీ, ఆయ‌న ఎదురుగానే ఈ సంఘ‌ట‌న‌లు అన్నీ జ‌ర‌గ‌డంతో ఆయ‌న‌కు ఫిర్యాదు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేద‌ని భావించి ఆగిపోయారు. ఇక నేరుగా అధిష్టానం వ‌ద్ద‌నే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. గ‌తంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఈ విష‌యంలో అంద‌రికీ స‌ర్ది చెప్పారు. అయినా, అస‌మ్మ‌తి త‌గ్గ‌లేదు. ఈ నేప‌థ్యంలో పంచాయ‌తీ మ‌రోసారి పీసీసీ చీఫ్ ద‌గ్గ‌ర‌కు చేర‌నుంది.

మంచిర్యాల జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఓదెలు, మాజీ మంత్రి బోడ జ‌నార్ద‌న్‌తో స‌హా బెల్లంప‌ల్లికి చెందిన ప‌లువురు అస‌మ్మ‌తి నేత‌లు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్రేంసాగ‌ర్ రావు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నార‌ని, అస‌మ్మ‌తిని ప్రోత్స‌హిస్తున్నార‌ని వారు ఆరోపిస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌రోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి స‌హ‌క‌రిస్తున్నార‌ని దుయ్య‌బ‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న డీసీసీని మార్చాల్సిందేన‌ని వారు ప‌ట్టుబ‌డుతున్నారు. లేకపోతే తామే పోటీగా డీసీసీ పెట్టుకుంటామ‌ని అస‌మ్మ‌తి నేత‌లు చెబుతున్నారు. అందులో ద‌ళితులు, బీసీల‌కు పెద్ద పీట వేస్తామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఇలా కాంగ్రెస్ పార్టీలో అస‌మ్మ‌తి వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపుతిరుగుతోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ మ‌ళ్లీ అస‌మ్మ‌తి చెల‌రేగుతుండ‌టంతో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఈ వ్య‌వహారం ఏ మ‌లుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like