1,000కి పెరగనున్న ఎంపీ స్థానాలు

-పార్లమెంటులో పెరగనున్న లోక్‌సభ సభ్యుల సంఖ్య
-543 నుంచి వెయ్యికి పెరగనున్న సీట్లు
-దాని ప్రకారమే కొత్త పార్లమెంటు భవన నిర్మాణం
-తెలంగాణ‌లో 17 నుంచి 39కి..?
-ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సైతం డ‌బుల్ కానున్న సీట్ల సంఖ్య
-మోదీ వ్యాఖ్య‌ల‌పై రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్

Parliament of India: ‘‘భవిష్యత్తులో, ఎంపీల సంఖ్య పెరిగినప్పుడు, వారు ఎక్కడ కూర్చుంటారు? అందువల్ల, కొత్త పార్లమెంటు భవనం అవసరమైంది. త్వరలో ఎంపీ సీట్లు పెరుగుతాయి, పాత పార్లమెంట్‌లో తగినన్ని సీట్లు లేవు, పాత పార్లమెంట్‌లో సాంకేతిక సమస్యలున్నాయి’’ పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి మోదీ చేసిన కీల‌క వ్యాఖ్య‌లు..

ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు కీల‌కంగా మారాయి. ముఖ్యంగా రాజ‌కీయవ‌ర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. లోక్‌సభ‌లో సభ్యుల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్ప‌టి నుంచో కసరత్తు చేస్తోంది. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా లోక్సభ స్థానాల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన కొత్తేమీ కాదు. ఇది ఎప్పటి నుంచో వస్తోంది. ప్రస్తుతం లోక్ సభలో ఉన్న స్థానాల సంఖ్య 545. ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను తీసేస్తే 543 స్థానాలే మిగులుతాయి. వాటిని క‌నీసం 848 నుంచి వెయ్యికి పెంచాలని ఎప్ప‌టి నుంచో భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎంపీ స్థానాల‌ను పెంచాల్సిన‌ అవసరం గుర్తించాలని చెబుతున్నారు ప‌లువురు రాజ‌కీయ నిపుణులు.

రాజ్యాంగం ప్రకారం 2026 తర్వాత పార్లమెంట్ స్థానాల సంఖ్య ఖ‌చ్చితంగా పెంచాల్సి ఉంది. అయితే ఆ స్థానాలను 2021 జనాభా లెక్కల ప్రకారం పెంచాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో మ‌రో ప్ర‌మాదం కూడా పొంచి ఉంద‌ని ప‌లువురు స్ప‌ష్టం చేస్తున్నారు. జనాభా నియంత్రణలో ద‌క్షిణాది రాష్ట్రాలు మెరుగైన ఫలితాలు సాధించాయి. కానీ, ఉత్త‌రాదిలో మాత్రం అందుకు విరుద్ధంగా విప‌రీతంగా జ‌నాభా పెరిగిపోయింది. అంటే ద‌క్షిణాది రాష్ట్రాలకు త‌క్కువ ఎంపీ సీట్లు ద‌క్కుతుండ‌గా, ఉత్త‌రాది రాష్ట్రాలకు మాత్రం ఎక్కువ సీట్లు ద‌క్కే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ అస‌మాన‌త‌లు జ‌ర‌గ‌కుండా కేంద్రం, రాజ‌కీయ నాయ‌కులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మోదీ ముంద‌స్తుగానే ఆలోచించి ఈ కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నానికి రూప‌క‌ల్ప‌న చేశారు. కొత్త పార్లమెంట్ ఛాంబర్‌ని కూడా 1,000 మంది కూర్చునే సామర్ధ్యంతో నిర్మించారు.

దేశవ్యాప్తంగా ఓటర్ల సంఖ్య, రాష్ట్రాల వారీగా నిష్పత్తి ప్రకారం లెక్కగడితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న 25 సీట్లు 52కి పెరిగే అవ‌కాశం ఉంది. తెలంగాణలో 17 నుంచి 39కి పెంచే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. మొత్తం సీట్లలో ఆంధ్రప్రదేశ్ వాటా 4.6% నుంచి 4.3%కి పడిపోగా, తెలంగాణలో 3.1% నుంచి 3.3%కు పెరుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రా నుంచి హైదరాబాద్ నగరానికి పెరిగిన వలసలే ఈ మార్పునకు కారణమై ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో సీట్ల సంఖ్య 80 నుంచి 193కు పెరిగే అవకాశముంది. ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 14.7% నుంచి 16%కు పెరగనుంది. మరోవైపు తమిళనాడు ప్రాతినిధ్యం 7.2 శాతం నుంచి 6.4 శాతానికి, కేరళ ప్రాతినిధ్యం 3.7 శాతం నుంచి 2.9 శాతానికి పడిపోతుంది. దీని ప్రకారం చూస్తుంటే జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గి, అధిక జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాతినిథ్యం మరింత పెరుగుతుంది.

లోక్‌సభ స్థానాలను 1000కి పెంచాల్సిన అవసరం ఉందని ఎప్ప‌టి నుంచో వాద‌నాలు ఉన్నాయి. మ‌రోవైపు రాజ్యసభ స్థానాలను కూడా పెంచాలని ప‌లువురు రాజ‌కీయ ప‌రిశీల‌కులు అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్‌లో 650, కెనడాలో 443, అమెరికాలో 535 మంది ఎంపీలున్నప్పుడు.. వాటి కంటే ఎంతో పెద్దదైన మనదేశంలో 1000 మంది ఎంపీలు ఎందుకు ఉండొద్ద‌ని ప‌లువురు వాదిస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై పూర్తిస్థాయి స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like