ఆప‌రేష‌న్‌ అడెల్లు..

-మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌లో అందెవేసిన చేయి
-ఎన్‌కౌంట‌ర్ల నుంచి చాక‌చ‌క్యంగా త‌ప్పించుకునే నేర్పు
-ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా అడవుల‌పై ప‌ట్టు
-ఈసారి ఎలాగైనా మ‌ట్టుపెట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో పోలీసులు
-అడ‌వుల్ని జ‌ల్లెడ ప‌డుతున్న పోలీసు బ‌ల‌గాలు

Police combing forests for Maoists: అడెల్లు అలియాస్ భాస్క‌ర్ ఇప్పుడు పోలీసుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పేరిది. మావోయిస్టు కీల‌క నేత, తెలంగాణ రాష్ట్ర క‌మిటీ స‌భ్యుడు అడెల్లు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప్ర‌వేశించాడ‌ని తెలియ‌డంతో పోలీసులు పూర్తిగా అప్ర‌మ‌త్తం అయ్యారు. ఆయ‌న కోసం వేట ముమ్మ‌రం చేశారు. ఆయ‌న ఎందుకు వ‌చ్చారు..? మ‌ళ్లీ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారా..? మ‌రేదైనా ప్లాన్ అమ‌లు చేసేందుకు వ‌చ్చారా..? అనేది నిఘా వ‌ర్గాలు ఆరా తీస్తున్నాయి.

మైలార‌పు అడెల్లు అలియాస్ భాస్క‌ర్ ది ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌లం పొచ్చెర‌. ఆయ‌న చిన్న‌ప్ప‌టి నుంచే రాడిక‌ల్ భావ‌జాలానికి ఆక‌ర్షితుల‌య్యారు. ఆయ‌న ద‌ళంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు పార్టీలో ఇప్పుడు కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. చాలా తొంద‌ర‌గా రాష్ట్ర క‌మిటీ స్థాయికి ఎదిగార‌ని పోలీసు వ‌ర్గాలు చెబుతాయి. ఆయ‌న దాదాపు రెండున్న‌ర ద‌శాబ్దాలుగా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఆయ‌న చ‌త్తీస్‌ఘ‌డ్ ప్రాంతంలో ప‌నిచేసిన‌ప్పుడు తెలంగాణ రాష్ట్ర క‌మిటీ స‌భ్యుడిగా రిక్రూట్‌మెంట్ పై దృష్టి సారించి ఇక్క‌డ చాలా మందిని పార్టీ వైపు ఆక‌ర్షించేలా చేయ‌డంలో విజ‌యం సాధించారు. ఆయ‌న ఎన్నో ఎన్‌కౌంట‌ర్ల నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాల్లో జ‌రిగిన దాదాపు ఆరు ఎన్‌కౌంట‌ర్ల‌లో ఆయ‌న త‌ప్పించుకున్నారు. రెండేళ్ల కింద‌ట క‌డంబా అడ‌వుల్లో సైతం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో పోలీసులు చుట్టుముట్టినా ఆయ‌న త‌ప్పించుకోగ‌లిగారు.

రిక్రూట్‌మెంట్ పైనే ప్ర‌ధాన దృష్టి…
అడెల్లు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప్ర‌ధానంగా రిక్రూట్‌మెంట్‌పైనే దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో పెద్ద ఎత్తున యువ‌త‌ను ద‌ళాల్లోకి ఆక‌ర్షించారు. అయితే అదే స్థాయిలో పోలీసులు సైతం రిక్రూట్‌మెంట్ అడ్డుకోగ‌లిగారు. 2020 జూలైలో లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత ఆదిలాబాద్‌ జిల్లాలో మైలారపు అడెల్లు అలి యాస్‌ భాస్కర్‌ గిరిజన తండాల్లో రిక్రూట్‌ మెంట్‌ కోసం ప్రయత్నించారు. కానీ కదంబా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందడం, మరోసారి జరిగిన ఎదురుకాల్పుల్లో అడెల్లు దళం తృటిలో తప్పించుకోవడంతో అతను మహారాష్ట్ర మీదుగా ఛత్తీస్‌గఢ్‌ వెళ్లి పోయాడు. అయితే కొద్ది రోజుల కింద‌ట ఇక్క‌డ‌కు వ‌చ్చిన ఆయ‌న రిక్రూట్‌మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం…

మ‌రేదైనా సంచ‌ల‌నం కోస‌మా..?
అడెల్లు దాదాపు రెండేళ్ల తరువాత తిరిగి అడెల్లు తెలంగాణ‌లోకి ప్రవేశించడంతో నిఘా వ‌ర్గాలు ఆరా తీస్తున్నాయి. మావోయిస్టుల‌కు క‌రీంగ‌న‌ర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున పేలుడు ప‌దార్థాలు చేర‌వేయ‌డంతో పాటు, ఆర్థికంగా కూడా స‌హ‌క‌రించిన‌ట్లు పోలీసులు అరెస్టులు చేయ‌డంతో ఈ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో మావోయిస్టులు అల‌జ‌డి సృష్టించి రాజకీయ నేతలను హతమార్చి నిధులు, ఉనికిని సాధించే ప్రణాళికను అమలు చేసేందుకే అడెల్లు, ఇతర దళాలు తెలంగాణలోకి వచ్చాయని అధికారులు భావిస్తున్నట్లు స‌మాచారం. భాస్కర్‌పై 20 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు.

ఏదిఏమైనా ఈసారి ఆపరేష‌న్ అడెల్లు చేప‌ట్టిన పోలీసులు ఆయ‌న్ను ఎలాగైనా మ‌ట్టుబెట్టాల‌ని భావిస్తున్నారు. ఆయ‌న‌ను ఎన్‌కౌంట‌ర్ చేయ‌గ‌లిగితే ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మావోయిస్టు పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లుగుతుంది. ఇప్ప‌టికే ఇబ్బందుల్లో ఉన్న మావోయిస్టు పార్టీ ఇక కోలుకోవాలంటే క‌ష్టం. అందుకే ఆయ‌నను టార్గెట్ చేస్తూ అడ‌వుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వ‌హిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like