పోలీసులు నా కొడుకు హ‌త్య‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు

-హ‌త్య‌కు టీఆర్ఎస్ నేత‌ల అండ‌దండ‌లు
-అందుకే క‌నీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదు
-తెల్ల కాగితాల‌పై సంత‌కాలు తీసుకున్నారు

తన కొడుకు పందుల రామ‌కృష్ణ‌ది రోడ్డు ప్ర‌మాదం కాద‌ని, అది హ‌త్యేన‌ని ఆయ‌న త‌ల్లిదండ్రులు శ్రీనివాస్, లక్ష్మీ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయ‌న హ‌త్య కేసులో టీఆర్ఎస్ నేత‌ల హ‌స్తం ఉంద‌ని అందుకే పోలీసులు కేసు త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బుచ్చయ్యపల్లి గ్రామపంచాయతీ పెద్దదుబ్బ గ్రామానికి చెందిన తన కొడుకు రామకృష్ణను జూన్ 22న ట్రాక్టర్ ఓనర్ ముక్కెర రామకృష్ణ, ట్రాక్టర్ డ్రైవర్ బండారి వంశీకృష్ణ ఫోన్ చేసి నీళ్ళు తేవాలని చెప్పారని అన్నారు. ట్రాక్టర్ వద్దకు వెళ్ళిన తమ కొడుకును ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్య చేశారని ఆరోపించారు. తాము ఘటన స్థలానికి వెళ్లగా డ్రైవర్ బండారి వంశీకృష్ణ ఓనర్ ముక్కెర రామకృష్ణ హత్యను రోడ్డు ప్రమాదంగా సృష్టించారని ఆందోళన వ్యక్తం చేశారు.

న్యాయం చేయాలని తాళ్ళగురిజాల ఎస్సై రాజశేఖర్ వ‌ద్ద‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఫిర్యాదు స్వీకరించలేదని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హత్య జరిగిన రోజు తమ వద్దకు వ‌చ్చిన ఎస్సై తెల్లకాగితాలపై సంతాకాలు తీసుకున్నారని తెలిపారు. సంతకాలు ఎందుకు అని అడిగితే నీ కొడుకు శ‌వం కావాలా..? వద్దా…? అని తమను బెదిరించారని అన్నారు. హత్య చేసిన వారికి అనుకూలంగా తాము సంత‌కాలు పెట్టిన కాగితాల‌ను మార్చారని వివరించారు. హత్య విషయమై తమ ఫిర్యాదు ఎస్సై రాజశేఖర్, రూరల్ సీఐ కోట బాబురావు స్వీకరించలేదని స్పష్టం చేశారు. ఎస్సై, సీఐలు నిందితులకే వత్తాసు పలుకుతూ తీరని అన్యాయం చేశార‌ని వారు విలపించారు.

నిందితునికి మద్దతుగా ఉన్న టీఆర్ఎస్ ఎంపీటీసీ పొట్లపల్లి సుభాష్ రావు, సర్పంచ్ భర్త పొలవేని శ్రీనివాస్, ట్రాక్టర్ డ్రైవర్ ముక్కెర రామకృష్ణ, అతని బాబాయ్ పిట్టల శ్రీనివాస్, మామయ్య ముత్యాల భీమరాజు హత్యలో భాగ‌స్వామ్యులని, పోలీసులు వారి ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకుని నిందితుల‌కు అండ‌గా ఉంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న్యాయం చేయాల్సిన‌ పోలీస్ లే తమకు తీరని అన్యాయం చేస్తున్నార‌ని క‌న్నీటి ప‌ర్యంత‌య్యారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తన కొడుకును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వరంగల్ రేంజ్ ఐజీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామ‌ని హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like