ప్రైవేటీక‌ర‌ణ పాపం మీదే

-నెపం మాత్రం కేంద్రానిదా..?
-తాడిచెర్ల ఏఎంఆర్ కంపెనీ వెన‌క ఎవ‌రున్నారు..?
-కార్మికులు నిజానిజాలు తెలుసుకోవాలి
-బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు వివేక్ వెంక‌ట‌స్వామి

సింగ‌రేణిలో ప్రైవేటీక‌ర‌ణ పాపం ఖ‌చ్చితంగా రాష్ట్ర ప్ర‌భుత్వానిదేన‌ని బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి ఆరోపించారు. బిఎంఎస్ కార్మిక చైతన్య యాత్ర అడ్రియాలా లాంగ్వాల్ ప్రాజెక్టు గేట్ మీటింగ్‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ సింగ‌రేణిలో రాష్ట్ర ప్ర‌భుత్వానిది 51 శాతం వాటా ఉంద‌ని దానికి సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం పూర్తి అడ్మిస్ట్రేష‌న్ చూస్తోంద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా కేవ‌లం సింగ‌రేణిలో మాత్ర‌మే ప్రైవేటీక‌ర‌ణ సాగుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడిచెర్ల ఏఎంఆర్ కంపెనీ వెన‌క ఎవ‌రున్నారో అంద‌రికీ తెలుసున‌ని స్ప‌ష్టం చేశారు. వేలం పాట లేకుండా దానిని ఆ కంపెనీని ఎలా క‌ట్టబెట్టారని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రైవేటీక‌ర‌ణ చేసేది మీరు.. కేంద్రం మీద నెపమా..? అని దుయ్య‌బట్టారు. కార్మికులు నిజానిజాలు తెలుసుకోవాల‌ని వివేక్ కోరారు.

ఈ సంద‌ర్భంగా బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ అల‌వెన్స్‌ల మీద ఆదాయ‌పు ప‌న్ను కోల్ ఇండియాలో చెల్లిస్తున్నార‌ని, అది ఇక్క‌డ అమ‌లు కావ‌డం లేద‌న్నారు. జేబీసీసీఐ ఒస్పందాలు సింగ‌రేణిలో ఎందుకు అమ‌లు చేయ‌డం లేదని ప్ర‌శ్నించారు. ఆదాయ‌పు ప‌న్ను రూపేణా కార్మికుల‌పై రూ. 250 కోట్లు భారం ప‌డుతోందని. దీనిని సింగ‌రేణి కార్మికుల‌కు రియంబెర్స్మెంట్ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. మిగ‌తా కార్మిక సంఘాల్లో రిటైర్‌మెంట్ అయిన వారు, దిగుమ‌తి అయిన వారు ఉన్నారని స్ప‌ష్టం చేశారు. కేవ‌లం బీఎంఎస్‌లో మాత్ర‌మే కార్మికుల కోసం ప‌నిచేసే నాయ‌కులు ఉన్నార‌ని చెప్పారు. కార్మికుల‌కు 250 గ‌జాల భూమి ఇస్తామ‌ని. వ‌డ్డీ లేని రూ. 50 ల‌క్ష‌ల రుణం ఇస్తామ‌న్నారు.

కార్య‌క్ర‌మంలో బీఎంఎస్ కోశాధికారి వేణుగోపాలరావు, ఉపాధ్యక్షులు అరుకాల ప్రసాద్,కేంద్ర కమిటీ సభ్యులు మామిడిస్వామి, పోతరాజు రాజు,గాజులవెంకటస్వామి,అనుప రమేష్,వల్లెపు సురేష్,రామాంచ సంపత్,విద్యాసాగర్,బండారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like