రైతుల‌ను ఇబ్బంది పెడితే బ్యాంకుల దిగ్బంధం

బీజేపీ ఆధ్వ‌ర్యంలో బ్యాంకు ముందు ధర్నా

ఆదిలాబాద్ : బ‌్యాంకు అధికారులు రైతుల‌ను ఇబ్బంది పెడితే బ్యాంకుల దిగ్బంధిస్తామ‌ని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ హెచ్చ‌రించారు. ఫసల్ భీమా డబ్బులు బకాయిల కింద జమ చేకుంటున్న దక్కన్ గ్రామీణ బ్యాంక్ ముందు సోమ‌వారం ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకొనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ భీమా అందిస్తోంద‌న్నారు. రైతుల‌ను చిన్న చూపు చూసే రైతు వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వం తనవాటా చెల్లించక రెండేళ్లుగా ముప్పుతిప్ప‌లు పెడుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తే హైకోర్టు వేసిన మొట్టికాయ‌ల‌తో రాష్ట్రం దిగివ‌చ్చింద‌న్నారు. 2018 – 2019 సంవత్సరం డబ్బులు విడుదల చేసింద‌ని వెల్ల‌డించారు. బ్యాంకు అధికారులు క్రాప్ లోన్ బకాయిలు, డ్వాక్రా బకాయిలు అని రైతుల డ‌బ్బులు గ‌ద్ద‌ల్లా త‌న్నుకుపోతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒకవైపు ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఈ సంవత్సరం భారీగా వర్షాలతో పంట దిగుబడి రాక తీవ్రంగా న‌ష్ట‌పోయిన రైతులకు ఫసల్ భీమా డబ్బులు ఆసరాగా ఉంటాయ‌నుకుంటే అధికారులు రైతులను ఇబ్బంది పెట్టడం సరికాద‌న్నారు. అధికారులు తమ ధోరణి మార్చుకోకుంటే రైతులందరి తో కలిసి పిల్ల పాపలతో వచ్చి బ్యాంకులను దిగ్బంధం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్ఛా అధ్యక్షులు దయాకర్ బీజేపీ జిల్లా నాయకులూ వేణుగోపాల్, ముకుంద్ రావు. భూమన్న,రత్నాకర్ రెడ్డి పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like