రోజుకు 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి

ఈ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల్లో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే మంచి వృద్ధిని సింగరేణి సంస్థ నమోదు చేసిందని సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీధర్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జీఎంలతో నెలవారీ ఉత్పత్తి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇదే ఒరవడితో 68 మిలియన్‌ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించాలని ఆయ‌న కోరారు. తద్వారా సింగరేణి చరిత్ర లోనే అత్యుత్తమ రికార్డులను నెలకొల్పాలని అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు.

సింగరేణి సంస్థ గత ఏడాది మొదటి 9 నెలల్లో సాధించిన బొగ్గు ఉత్పత్తి తో పోల్చితే ఈ ఏడాది 42 శాతం వృద్ధిని న‌మోదు చేసింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అదేవిధంగా బొగ్గు రవాణా లో 52 శాతం వృద్ధిని, ఓవర్‌ బర్డెన్‌ తొలగింపులో 23 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. మిగిలిన మూడు నెలల కాలంలో ప్రతి ఏరియా తనకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలని ఆదేశించారు. ఏరియాల వారీగా సాధించాల్సిన ఉత్పత్తి లక్ష్యాలను ఆయన నిర్దేశించారు. ఇకపై రోజుకు 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 14.8 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ తొలగింపు జరపాలని ఆయన ఆదేశించారు.

ఏప్రిల్ నెల‌ నుంచి ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్‌ నుంచి బొగ్గు ఉత్పత్తి రానుందని, దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్‌ టన్నుల లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కొత్త గనుల నుంచి ఉత్పత్తి సాధించడంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ సమస్యలను ఆ ప్రాంత ప్రభుత్వ ఉన్నతాధికారుల సహకారం తీసుకుంటూ పరిష్కరించుకోవాలని జీఎంలను ఆదేశించారు.

అడ్రియాల లాంగ్‌ వాల్‌ నుంచి నెలకు 2 లక్షల టన్నులు
అడ్రియాల లాంగ్‌ వాల్‌ ప్రాజెక్టు, కంటిన్యూయస్‌ మైనర్‌ గనుల పనితీరుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఆయ‌న‌ అడ్రియాల లాంగ్‌ వాల్‌ నుంచి రెండు నెలల కాలంగా మెరుగైన ఉత్పత్తి సాధించడం ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ నెలలో 2 లక్షల టన్నుల ఉత్పత్తి, తర్వాతి నెల నుంచి 2.5 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలని స్పష్టం చేశారు. ఈ గనిలో ఇంకా మిగిలి పోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని, తగినంత మానవ వనరులను సంసిద్ధ పరచుకోవాలని ఆదేశించారు. నాలుగో ప్యానెల్‌ కు సంబంధించిన సన్నాహాలను మరింత వేగవంతం చేయాలన్నారు.

వివిధ గనుల్లో ఉన్న కంటిన్యూయస్‌ మైనర్ల పనితీరును కూడా సమీక్షించారు. జీడీకే 11 ఏ గనిలో ఉన్న రెండు కంటిన్యూయస్‌ మైనర్లు ఒక్కొక్కటి 25 నుంచి 30 వేల టన్నుల ఉత్పత్తిని సాధించాలని, అలాగే పీవీకే-5, వకీల్‌ పల్లి లోని కంటిన్యూయస్‌ మైనర్లు కూడా ఇదే స్థాయి లో ఉత్పత్తులు సాధించాలని ఆదేశించారు. సమావేశంలో హైదరాబాద్‌ కార్యాలయం నుంచి ఛైర్మన్‌ తోపాటు డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, పర్సనల్‌, ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్లానింగ్‌) ఎన్‌.బలరామ్‌, డైరెక్టర్‌ (ఇ అండ్‌ ఎం) సత్యనారాయణరావు, అడ్వైజర్‌ (మైనింగ్‌) ఎన్‌.ప్రసాద్‌, అడ్వైజర్‌ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఈడీ (కోల్‌ మూమెంట్‌) ఆల్విన్‌, జీఎం (కో ఆర్డినేషన్‌) కె.సూర్యనారాయణ, జీఎం (సీపీపీ) నాగభూషణ్‌ రెడ్డి, జీఎం (మార్కెటింగ్‌) కె.రవిశంకర్‌, జీఎం (పీపీ) సత్తయ్య, జీఎం (స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌) సురేందర్‌, జీఎం (అడ్రియాల) ఎన్‌.వి.కె.శ్రీనివాస్‌, ఎస్వో టూ డైరెక్టర్ రవిప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like