స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో టీబీజీకేఎస్ విఫ‌లం

కార్మికుల గురించి యాజ‌మాన్యం సైతం ప‌ట్టించుకోవ‌డం లేదు - జ‌న‌వ‌రి 26 త‌ర్వాత సింగ‌రేణి వ్యాప్తంగా భ‌రోసా యాత్ర - హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు, వేజ్‌బోర్డు స‌భ్యుడు రియాజ్ అహ్మ‌ద్

మంచిర్యాల – తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం గెలిచినా కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలో పూర్తి స్థాయి విఫ‌ల‌మ‌య్యింద‌ని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు, వేజ్‌బోర్డు స‌భ్యుడు రియాజ్ అహ్మ‌ద్ మండిప‌డ్డారు. ఆయ‌న బెల్లంప‌ల్లి ఏరియా గోలేటి వర్క్ షాప్‌లో ఆదివారం నిర్వ‌హించిన గేట్ మీటింగ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా మాదారం గోలేటి భూగర్భ గనులు, ఓపెన్‌కాస్టుల‌కు ఉపయోగపడ్డ వర్క్ షాప్ లో స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. గెలిచిన టీబీజీకేఎస్ యూనియన్ పట్టించుకోకపోవడంతో కోట్ల రూపాయల విలువ చేసే యంత్ర సామ‌గ్రి పాడ‌వుతున్నాయ‌ని అన్నారు. వర్క్ షాప్ లో సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసి యంత్రాలు పాడుకాకుండా చూడాల‌ని కోరారు. టీబీజీకేఎస్ కార్మిక సమస్యలు పరిష్కరించే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోగా, ఓడిపోయిన యూనియన్ మాదిరిగా వినతి పత్రాలు ఇస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఆ యూనియ‌న్‌లో కార్మిక సమస్యల‌పై స‌రిగ్గా మాట్లాడే నాయకత్వం లేదని విమ‌ర్శించారు. అందుకే జనవరి 26 తర్వాత గోలేటి నుండి కొత్తగూడెం వరకు కార్మికుల సమస్యలపై పోరాటం చేసేందుకు, కార్మికుల‌ను చైత‌న్యం చేసేందుకు భరోసా యాత్ర నిర్వహిస్తామన్నారు. బెల్లంపల్లి ఏరియాలో 1100మంది కార్మికులు, 600 మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నార‌ని వారంద‌రికీ స‌రైన వైద్య స‌దుపాయం అందించే అవ‌కాశాలు లేవ‌న్నారు. హాస్పటల్లో సరిపడా వార్డ్‌బాయ్స్‌,స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు,స్కావెంజర్స్ లేరన్నారు. వైద్యం చేయడానికి ఒక్క వైద్యుడు మాత్ర‌మే ఉన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేవ‌లం ఒక్క వైద్యునితో మూడు, నాలుగు వేల మందికి వైద్యం అంద‌ని ద్రాక్ష‌లా మారింద‌న్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లడంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెంరాజబాబు, శ్రీరాంపూర్ బ్రాంచ్ సెక్రటరీ సారయ్య బెల్లంపల్లి ఏరియా సెక్రెటరీ ఇనూన్, వర్క్ షాప్ పిట్ సెక్రటరీ వసీమ్, ఎస్‌అండ్‌పీసీ సెక్రటరీ శ్రీనివాస్ అబ్బాపూర్ ఓసీ పిట్ సెక్రటరీ రామకృష్ణ, ఆర్గ‌నైజ‌ర్లు తిరుపతి, నర్సయ్య, రమేష్, ప్రసాద్ , యాదవ్ లక్ష్మీ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like