సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే

-మరో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు ప్లాంటు డి.పి.ఆర్‌.కు ఆమోదం
-మందమర్రిలో 50 వేల టన్నుల సామర్థ్యం గల పేలుడు పదార్ధాల ప్లాంటు ఏర్పాటుకు ఆమోదం
-తెలంగాణ చేనేత సొసైటీ ద్వారా కార్మికులకు యూనిఫాం ల కొనుగోలుకు అంగీకారం
-సింగరేణి 561వ బోర్డు సమావేశంలో నిర్ణయాలు : సీఅండ్ఎండీఎన్‌.శ్రీధర్‌ వెల్లడి

మంచిర్యాల : రాష్ట్రపతి ఉత్తర్వులను అనుస‌రించి సింగరేణి సంస్థలో ఇకపై జరగనున్న ఉద్యోగ నియామకాల్లో స్థానిక రిజర్వేషన్‌ శాతాన్ని పెంచడానికి సింగ‌రేణి బోర్డు అంగీకారం తెలిపింది. హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ లో శుక్రవారం జరిగిన 561వ సింగరేణి బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశానికి సీఅండ్ఎండీ శ్రీ‌ధ‌ర్ అధ్యక్షత వహించారు. ఈ సంద‌ర్భంగా స‌మావేశం వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఇప్పటి వరకు సింగరేణి విస్తరించిన నాలుగు ఉమ్మడి జిల్లాల వారికి అధికారేతర ఉద్యోగాలలో 80 శాతం స్థానిక రిజర్వేష‌న్‌, అధికారుల ఉద్యోగాలలో 60 శాతం స్థానిక రిజర్వేషన్‌ వర్తింపచేస్తున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఈ రెండు కేటగీరిలలో స్థానిక రిజర్వేషన్‌ ను 95 శాతానికి పెంచుతూ బోర్డు ఆమోదం తెలిపింద‌న్నారు. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తామ‌న్నారు. సింగరేణి విస్తరించిన 16 జిల్లాల ఉద్యోగార్ధులు ఇకపై సింగరేణి ప్రకటించే ఎగ్జిక్యూటివ్‌,ఎన్‌.సీ.డబ్ల్యు.ఏ ఉద్యోగాల్లో 95 శాతం పోస్టులకు రిజర్వేషన్ వ‌ర్తిస్తుంద‌న్నారు. మిగిలిన ఐదు శాతం ఓపెన్‌ క్యాటగిరీలో ఎంపిక చేస్తామ‌న్నారు.

మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ధ నెలకొల్పిన 1200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు ప్లాంటుకు అదనంగా అదే ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన మరో 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంటు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) సమావేశం ఆమోదించింది. రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు, సింగరేణి వ్యాపార విస్తరణ లో భాగంగా సుమారు 6,790 కోట్ల రూపాయల అంచనాతో ఈ 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) రూపొందించారు. 1200 మెగావాట్ల ప్లాంట్‌ ద్వారా సింగరేణి సంస్థకు ఏడాదికి సుమారు రూ. 500 కోట్ల మేర‌ లాభాలు సమకూరుతున్నాయని, ఈ కొత్త యూనిట్‌ కూడా సంస్థ ఆర్థిక సుస్థిరతకు దోహదపడ‌నుంది. సింగరేణి లో వివిధ గనులు, డిపార్ట్‌మెంట్‌ లలో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫాం పంపిణీకి తెలంగాణ స్టేట్‌ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ద్వారా 2 కోట్ల రూపాయల వ్యయంతో నామినేషన్‌ పద్ధతిన వస్త్రాల కొనుగోలు చేయ‌నున్నారు.

సంస్థకు అవసరమైన పేలుడు పదార్థాల సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ తో కలిసి మందమర్రి వద్ద 50 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్‌ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇప్పటికే సంస్థలో మణుగూరు, రామగుండం ఏరియాలలో గల 50 వేల టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష టన్నులకు పెంచడానికి కూడా బోర్డు ఆమోదించింది. పేలుడు పదార్థాల విషయంలో సింగ‌రేణి సంస్థ‌ స్వావలంబ‌న దిశగా అడుగులు వేసేందుకు ఈ నిర్ణ‌యాలు దోహ‌దం చేయ‌నున్నాయి.

సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్టర్లుగా వెస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్ సీఅండ్ఎండీ మనోజ్‌ కుమార్‌, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ డైరెక్టర్లు పిఎస్‌ఎల్‌ స్వామి, వి.కె.సోలంకి, సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎస్‌.చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, ప్రాజెక్ట్స్‌ అండ్ ప్లానింగ్‌, పర్సనల్‌) ఎన్‌.బలరామ్‌, డైరెక్టర్‌ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like