సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

-ఆ సంస్థ జోలికి వ‌స్తే సెగ ఢిల్లీకి తాకుతుంది
-రాష్ట్రం ఏర్పాటైన త‌ర్వాత 16 వేల ఉద్యోగాలు క‌ల్పించాం
-సింగరేణి బిడ్డలు, కార్మికులకు అండగా ఉంటాం
-ప్రైవేటీక‌ర‌ణ అంటే అంబేద్క‌ర్ ఆశ‌యానికి తూట్లు పొడ‌వ‌మే
-కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖ

మంచిర్యాల : సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ‌కు కేంద్రం కుట్ర ప‌న్నుతోంద‌ని, ఆ సంస్థ జోలికి వ‌స్తే సెగ ఢిల్లీకి తాకుతుంది మంత్రి కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న ఈ మేర‌కు సోమ‌వారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఘాటైన లేఖ రాశారు. సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారమ‌న్నారు. సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బిజెపి కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమ‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఏడేళ్ళ కాలంలో అభివృద్ధి ప్రస్థానంలో అద్భుతంగా ముందుకు దూసుకువెళ్తోంద‌న్నారు. ఇలాంటి సంస్థను ఉద్దేశ్యపూర్వకంగా చంపే కుట్రకు కేంద్రం తెరలేపిందని విమ‌ర్శించారు. సింగరేణిని బలహీనం చేసి, నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందన్నారు.

సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్ మైన్ అని వెల్ల‌డించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి దాకా 16 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామ‌న్నారు. సింగరేణిని ప్రైవేటకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశమే ఉండదని, గనులు మూతపడిన కొద్ది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటా వంటి అన్ని పోతాయ‌ని, అంతిమంగా సింగరేణి సంస్థ సమీప భవిష్యత్తులో కనుమరుగైపోతుందని ఆందోళన వ్య‌క్తం చేశారు. సింగరేణి కాపాడుకునేందుకు మేము అన్ని విధాలుగా సింగరేణి బిడ్డలకు కార్మికులకు అండగా ఉంటామని కేటీఆర్ భ‌రోసా ఇచ్చారు.

నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని మంత్రి కేటిఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారమని, సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బిజెపి కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమన్నారు. కేంద్రం సింగరేణిపై ప్రైవేటు వేటు వేస్తే బీజేపీపై రాజకీయంగా వేటు వేసేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. కేంద్ర మెడలు వంచిన రైతు పోరాటాన్ని మరిపించే మరో ఉద్యమానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. వారితో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. బొగ్గు బ్లాక్‌ల‌ను సింగరేణి సంస్థకు కేటాయించకుండా వాటికోసం వేలంలో పాల్గొనాలని నిర్దేశించడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింగరేణికి బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత 7ఏళ్ళ కాలంలో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందన్నారు. దీంతోపాటు బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తూ వస్తున్నదన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పిఎల్ఎఫ్ కలిగి ఉందన్న విష‌యాన్ని గుర్తు చేశారు. కేవలం సింగరేణి రాష్ట్రానికే పరిమితం కాకుండా మహారాష్ట్ర తోపాటు పలు దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీ ఎత్తున బొగ్గు సరఫరా అందిస్తూ దేశానికి విద్యుత్తు కాంతులను విరజిమ్ముతున్నదని వెల్ల‌డించారు. దీంతో పాటు సింగరేణి ప్రాంతంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ తన కార్యకలాపాలను విస్తరిస్తూ సింగరేణి ప్రగతి ప్రస్థానం లో దూసుకెళ్తున్నదని తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్ధ ఇవ్వని విధంగా 29 శాతం లాభాల్లో వాటను ఇస్తున్న ఎకైక సంస్ధ సింగరేణి అని కేటీఆర్‌ తెలిపారు. దీంతోపాటు కార్మికుల కోసం ఏ ప్రభుత్వరంగ సంస్ధ చేయనన్ని కార్మిక సంక్షేమ కార్యక్రమాలను సింగరేణి చేపట్టిందన్నారు.

లాభాల బాటలో అద్భుతమైన ప్రగతిపథంలో ఉన్న సింగరేణిని బలహీనపరిచి, నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందన్నారు. పక్క రాష్ట్రం అంద్రప్రదేశ్ లోనూ ఇదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కావల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసిన కేంద్రం దాన్ని ప్రయివేటీకరించేందుకు రంగం సిద్దం చేసిందన్నారు. సరిగ్గా ఇలాంటి కుట్రలనే సింగరేణిపై ప్రయోగించేందుకు రంగం సిద్దం చేస్తున్నదని అందోళన వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న సింగరేణికి సైతం బొగ్గు గనులు లేకుండా చేసి సంస్ధను చంపే కుట్రకు తెరలెపిందని కెటియార్ అన్నారు. మరోవైపు గుజరాత్లో మాత్రం అడిగిన వేంటనే లిగ్నైట్ గనులను ఏలాంటి వేలం లేకుండా నేరుగా గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ సంస్ధకు కేటాయించిన విష‌యం గుర్తు చేశారు. తెలంగాణలోని సింగరేణికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బిజెపి పాలనలో గుజరాత్ కో విధానం, తెలంగాణకొక విధానం ఉందన్నారు. తెలంగాణ దేశంలోని ఒక రాష్ర్టం కాదా ప్రశ్నించారు. ఇదీ కేవలం సింగరేణి సంస్ధపై మాత్రమే వివక్ష కాదని, ఇది తెలంగాణ రాష్ట్రంపై వివక్ష అన్నారు.

కేంద్రం లేవనెత్తిన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దళితులు, బహుజనులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దండయాత్రగా మంత్రి అభివర్ణించారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ రంగాన్ని ప్రైవేటుపరం చేయడం అంటే, డాక్టర్ బీఆర్.అంబేద్కర్ గారి ఆశయాలకు తూట్లు పొడవడమేనన్నారు. రిజర్వేషన్లకు పాతరేసే ఈ కుతంత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో సాగనివ్వబోమని హెచ్చరించారు. అంతిమంగా సింగరేణి సంస్థ సమీప భవిష్యత్తులో కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి ద్వారా రాష్ట్రంలోని రెండు వేల పరిశ్రమలుకు బొగ్గు అందుతుందని, ఒకవేళ ఈ సంస్థ ప్రైవేటీకరణ అయితే ఆయా పరిశ్రమలకు బొగ్గు సరఫరా అందడం ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి, వెళ్లి అంతిమంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పురోగతి ప్రమాదంలో పడుతుందన్నారు. మా దృష్టిలో కేంద్రం సింగరేణిలోని కేవలం నాలుగు బ్లాకులు మాత్రమే వేలం వేయడం లేదని, వేలాది మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్ లో వేలం వేస్తోందని విమర్శించారు. ఈ వేలంవెర్రి ఆలోచనలు ఇప్పటికైనా మానుకోకపోతే, ఎన్నో వీరోచిత పోరాటాలకు, ఉద్యమాలకు కేరాఫ్ గా నిలిచిన సింగరేణి కార్మికులు మరోసారి ఉక్కుపిడికిళ్లు బిగించడం ఖాయమని, కేంద్రంలోని బీజేపీని వెంటపడి తరమడం తథ్యమని హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like