ఏడు నెలల్లో సింగరేణి టర్నోవర్ రూ.14,067 కోట్లు

ఆర్జించిన లాభాలు రూ.868 కోట్లు - గత ఏడాది సాధించిన టర్నోవర్ పై 65 శాతం వృద్ధి - బొగ్గు అమ్మకాలలో 78 శాతం వృద్ధి - విద్యుత్ అమ్మకాలలో 18 శాతం వృద్ధి - లాభాలలో 177శాతం వృద్ధి - ఈ ఏడాది ఆల్ టైం రికార్డుగా ఉత్పత్తి, రవాణా టర్నోవర్, లాభాలు సాధించనున్న సింగరేణి - సింగరేణి సీఅండ్ఎం.డీ శ్రీధర్

సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఏడు నెలల కాలంలో రూ. 14067 కోట్ల అమ్మకాలు జరిపి, రూ.868 కోట్ల లాభాలను ఆర్జించిందని సింగరేణి సంస్థ సీఅండ్ఏ ఎండి శ్రీధర్ వెల్లడించారు. సింగరేణి వ్యాప్త బొగ్గు గనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో నాలుగు రోజులుగా సమీక్షలు నిర్వహించిన అనంతరం సంస్థ ఆర్థిక విషయాలపై శనివారంనాడు సమీక్షించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నెలతో ముగిసిన తొలి ఏడు నెలల కాలంలో రూ. 8537 కోట్ల అమ్మకాలు జరపగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి 65 శాతం వృద్ధితో రూ. 14,067 కొట్ల అమ్మకాలు జరిపిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కరోన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో బొగ్గు అమ్మకాలు ,రవాణా తగ్గడం తో రూ.1129కోట్ల నష్టాలను కంపెనీ చవి చూసిందని కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు నెలల్లో కరోనా నివారణ చర్యలు ఫలించి బొగ్గు ఉత్పత్తి రవాణా, విద్యుత్అమ్మకాలుకూడా పెరగడంతో గత ఏడాది పై 177శాతం వృద్ధి తో రూ.868కోట్ల లాభాలను సాధించ గలిగామని వివరించారు. ఇంకా మిగిలిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బొగ్గు అమ్మకాల లో 78 శాతం వృద్ధి..
బొగ్గు ,విద్యుత్ అమ్మకాలు కలిపి గడిచిన ఏడు నెలల్లో సింగరేణి సంస్థ గత ఏడాది ఇదే కాలంలో సాధించిన దానిపై 65 శాతం అభివృద్ధిని కనపరచగా , కేవలం బొగ్గు అమ్మకాల లో 78 శాతం వృద్ధి, విద్యుత్ అమ్మకాలలో 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది తొలి ఏడు నెలల కాలంలో రూ.6678 కోట్ల బొగ్గు అమ్మకాలు జరపగా ఈ ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి 78 శాతం వృద్ధితో రూ.11,855 కోట్ల విలువైన బొగ్గు అమ్మకాలు నిర్వహించింది. కాగా గత ఏడాది తొలి ఏడు నెలల్లో రూ.1860 కోట్ల విద్యుత్ అమ్మకాలు జరగగా ఈ ఏడాది అదే కాలానికి 18 శాతం వృద్ధితో రూ.2182కోట్ల విద్యుత్ అమ్మకాలు జరిపింది.

పెరిగిన ఉత్పత్తి తో పెరుగుతున్న అమ్మకాలు, లాభాలు

సీ అండ్ ఎండీ శ్రీధర్ ఏడాది కాలం గా కంపెనీ వ్యాప్తంగా తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలు, నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఉత్పత్తి సమీక్షలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి .గత ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు నెలల్లో సాధించిన బొగ్గు ఉత్పత్తి ,విద్యుత్ ఉత్పత్తి కన్న ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలో సాధించిన అద్భుత వృద్ధి కారణంగా అమ్మకాలు లాభాలు కూడా గణనీయంగా పెరిగాయి.గత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో కేవలం 220 లక్షల టన్నుల బొగ్గు ను ఉత్పత్తి చేసిన సింగరేణి సంస్థ ఈ ఏడాది అదేకాలానికి 60 శాతం వృద్ధితో 352 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలిగింది. అలాగే గత ఏడాది తొలి ఏడునెలల్లో 218 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపిన సింగరేణి ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 68 శాతం వృద్ధితో 367 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసింది. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గత ఏడాది అక్టోబర్ నెల వరకు 3819 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 39 శాతం వృద్ధి తో 5291 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాలకు అందించడం జరిగింది.ఫలితంగా టర్నోవర్ లాభాలు గణనీయంగా పెరిగాయి.

ఈ ఏడాది చరిత్రలోనే అత్యధిక టర్నోవర్ లాభాలు

దేశ రాష్ట్ర విద్యుత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ తన శక్తి మేర సాధ్యమైనంత ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేస్తూ అవసరమైన థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అందజేస్తోందని, ఇదే ఒరవడితో మిగిలి ఉన్న ఐదు నెలల కాలంలోకూడా గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేయనున్నామని, దేశ విద్యుత్ అవసరాలను తీర్చడమే ప్రధానలక్ష్యంగా సింగరేణి కుటుంబం మొత్తం అంకితభావంతో పనిచేస్తోందని ఆయన వివరించారు.ఈ క్రమంలో ఈ ఏడాది సింగరేణి తన చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి,రవాణా , వార్షిక టర్నోవర్ ,లాభాలు సాధించనున్న దని సంస్థ చైర్మన్ అండ్ ఎండి శ్రీధర్ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like