వీళ్లు మార‌రు..

-మంచిర్యాలలో ల‌బ్ధిదారుల‌కు కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ
-సోష‌ల్ మీడియాలో పాడైన కోడిగుడ్ల వీడియో హ‌ల్‌చ‌ల్‌
-ఎన్నిమార్లు ఫిర్యాదులు వెళ్లినా ప‌ట్టించుకోని అధికారులు
-మీ ఇండ్ల‌లో పిల్ల‌ల‌కు ఇలాగే పెడ‌తారా..? అని ప్ర‌శ్నిస్తున్న ప్ర‌జ‌లు
-కంట్రాక్ట‌ర్‌,అధికారుల మిలాఖ‌త్‌
-ప్ర‌తి నెలా ల‌క్ష‌ల్లో చేతులు మారుతున్న వైనం

మంచిర్యాల : ఎన్నిమార్లు ఫిర్యాదులు వెళ్లినా… ప్ర‌జలు ఎన్ని ఇబ్బందులు ప‌డ్డా అంగ‌న్‌వాడీ సిబ్బంది ప‌నితీరు మాత్రం మార‌డం లేదు. ఉన్న‌తాధికారులు చివాట్లు పెట్టినా, మీ ప‌నితీరు స‌రిగ్గా లేద‌ని హెచ్చ‌రించినా వారి ప‌నితీరు మాత్రం మార‌డం లేదు. త‌మ‌ను కాద‌న్న‌ట్లు దులుపుకుని పోతున్నారు. కోడిగుడ్ల సైజు, నాణ్య‌త‌పై ఎన్నిమార్లు చెప్పినా అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, సూప‌ర్‌వైజ‌ర్లు, సీడీపీవోలు ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌తి నెలా వారికి మామూళ్లు ముడుతుండ‌టంతో నోరు మెద‌ప‌డం లేదు.

తాజాగా మంచిర్యాల ప‌ట్ట‌ణం తిల‌క్‌న‌గ‌ర్ మూడో వార్డులో అంగ‌న్‌వాడీ టీచ‌ర్ ఈ నెల 4న కోడిగుడ్లు పంపిణీ చేసింది. వాటిని తీసుకున్న ల‌బ్ధిదారులు ఉడ‌క‌పెట్టి పిల్ల‌ల‌కు పెట్టారు. పిల్ల‌ల‌కు అస్వ‌స్థ‌తకు గురికావ‌డంతో ఆసుప‌త్రికి తీసుకువెళ్లారు. త‌ర్వాత అనుమానం వ‌చ్చిన వారు కోడిగుడ్లు ఉడ‌క‌బెట్టి మొత్తం తీసి చూడ‌గా, కొన్ని కుళ్లిపోయి, మ‌రికొన్ని పాడై ఉన్నాయి. త‌ర‌చూ ఇలాగే జ‌రుగుతున్నా ప‌ర్య‌వేక్షించాల్సిన అధికారులు మాత్రం క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు.

వాస్త‌వానికి గుడ్ల నాణ్యతపై అంగన్వాడీ కేంద్రాలను ప్రాజెక్టు అధికారులు క‌నీసం ప‌రిశీలించ‌డం లేద‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. జిల్లాలో ప్ర‌తి నెలా రెండు విడ‌త‌లుగా మూడు లక్ష‌ల పై చిలుకు గుడ్లు అంద‌చేస్తారు. ఇందులో ఏడు నుంచి ఎనిమిది ల‌క్ష‌ల వ‌ర‌కు చేతులు మారుతున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే అధికారులు అటువైపు క‌న్నెత్తి కూడా చూడటం లేద‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like