ప్రాజెక్టులకు పైసల్లేవ్..
-గాలిలో దీపంలా ప్రాజెక్టుల భద్రత
-గత ఏడాది కడెం స్పిల్ వే నిర్మించాలన్న డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్
-నివేదిక గాలికి వదిలేసిన తెలంగాణ సర్కార్
-మెకానికల్ విభాగం ఎత్తివేతతో తప్పని ఇబ్బందులు
-కొమురం భీమ్ ప్రాజెక్టు సైతం ప్రమాదం అంచునే..
-కవర్లు కప్పి కాపాడుతున్న ఇంజనీరింగ్ అధికారులు
-కనీస మరమ్మతులకు సైతం నిధులు విదిల్చని ప్రభుత్వం
ప్రాజెక్టులు రైతుల పాలిట కల్పతరువులు.. వాటిలో నీరు నిండితేనే వారు పంట పండించేది… మన కడుపు నిండేది. అలాంటి ప్రాజెక్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు దేవుడు ఎరుగు… కనీసం వాటి నిర్వహణకు సైతం సక్రమంగా నిధులు కేటాయించండం లేదు. దీంతో ఏటా ప్రాజెక్టులు ప్రమాదం అంచు వరకు వెళ్లివస్తున్నాయి. అయినా, ప్రభుత్వం వీసమెత్తు కూడా చలించడం లేదు.
నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్టు మరోసారి ప్రమాదం నుంచి బయటపడింది. పెద్దఎత్తున వచ్చిన వరద నేపథ్యంలో ఆ ప్రాజెక్టు తెగిపోతుందని అధికారులు భయపడ్డారు. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాజెక్టు కింది గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రాజెక్టు గేట్లపై నుంచి వరద నీరు దిగువకు ఉధృతంగా దూకిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రాజెక్టు కింద ఉన్న మైసమ్మ గుడి ప్రాంతంలో ప్రధాన కాలువకు గండిపడి కాలువ కొట్టుకుపోయింది. ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉండగా. గురువారం వరకు 14 గేట్లు మాత్రమే పనిచేశాయి. ప్రాజెక్టు కట్ట సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు మాత్రమే కాగా, ప్రాజెక్టులోకి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. ప్రాజెక్టు అధికారులు, దానిని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రేఖా నాయక్ సైతం అక్కడి నుంచి పరిగెత్తారు. చివరకు అధికారులు మరమ్మతులు చేయడంతో మరో రెండు గేట్లు జేసీబీల సాయంతో తెరిచారు. సాయంత్రం తర్వాత ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పదే పదే అదే భయం…
కడెం ప్రాజెక్టు కేవలం ఇప్పుడే కాదు.. భారీగా వరదలు వచ్చిన ప్రతీ ఏటా ఇదే గోస. గతేడాదే సైతం భారీ వరదలతో ప్రాజెక్టు వణికిపోయింది. తాజా వరదతో మళ్లీ అదే పరిస్థితి. గతేడాది ఏకంగా 6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. పోయిన సంవత్సరం ప్రాజెక్టును డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్ఆర్పీ) తనిఖీలు చేసి అదనంగా 5 గేట్లతో స్పిల్ వే కట్టాలని నివేదిక ఇచ్చింది. అదనపు స్పిల్వే కోసం రూ.500 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనాలు వేసి ఐదు గేట్లతో స్పిల్వే కోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. యుద్ధ ప్రాతిపదికన దీని నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు.
మెకానికల్ విభాగం ఎత్తేసిన ప్రభుత్వం..
నీటిపారుదలశాఖలో కీలకమైన మెకానికల్ విభాగాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. ప్రతి ఏటా ప్రాజెక్టుల గేట్ల ఓవర్ హాలింగ్, గ్రీజింగ్ పనులు చేపట్టి వానాకాలం నాటికి సిద్ధంగా ఉంచే ఈ శాఖ ఉనికిలో లేకుండా పోయింది. దీంతో దశాబ్దాలుగా గేట్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో తీవ్ర వరదల సమయంలో గేట్లు ఓపెన్ కావడం లేదు. ఒకవేళ కడెం జలాశయానికి గండి పడి ఉంటే మంచిర్యాల జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగేవి. ఏటా ఇలాగే అవుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. అడపాదడపా నిధులు విడుదల చేసినా కేవలం అవి ప్రాజెక్టుకు సంబంధించి చిన్న చిన్న పనులకు మాత్రమే సరిపోతున్నాయి.
సిబ్బంది లేక ఇబ్బంది…
మరోవైపు సరైనంత సిబ్బంది కూడా లేకపోవడం ప్రాజెక్టులకు శాపంగా మారుతోంది. సిబ్బంది లేక నిర్వహణ సైతం సక్రమంగా జరగడం లేదు. కడెం ప్రాజెక్టు ప్రమాదం అంచున ఉన్న సమయంలో సిబ్బంది గేట్లు ఎత్తలేక ఇబ్బందులు పడ్డారు. దీంతో స్థానిక యువత ప్రాణాలకు తెగించి కట్టపైకి వచ్చి గేట్లు తెరించేందుకు సిబ్బందికి సాయం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. కడెం ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి ఉండాల్సిన వారు లేకపోడంతో నిర్వహణ కష్టం అవుతోంది. ఏదైనా ఇబ్బందులు ఉన్న సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో ప్రాజెక్టు పట్ల వారికి ఏ మాత్రం అవగాహణ ఉండటం లేదు.
ప్రపంచ సాగునీటి రంగంలో అద్భుతం..
ప్రాజెక్టు ప్రమాదం అంచున ఉంటే ఎవరైనా దానికి మరమ్మతులు చేస్తారు. కానీ, తెలంగాణ సాగునీటి శాఖ అధికారులు మాత్రం ఓ అద్భుతాన్ని చేసి చూపించారు. ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు లేకపోవడం, దానిని కాపాడుకోవడానికి అధికారులు ఓ ప్లాస్టిక్ కవర్ కప్పేశారు. గత ఏడాది కొమురం భీమ్ ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. ప్రాజెక్టు ప్రమాదం అంచుకు చేరింది. వరద ఉధృతికి ప్రాజెక్టు ఆనకట్ట కుడివైపు చివరి భాగంలో 700 నుంచి 990 మీటర్ల మధ్య దెబ్బతింది. రాళ్లు, మట్టి కొట్టుకుపోయి బలహీనంగా మారింది. నీటి తాకిడికి మెల్లమెల్లగా కుంగిపోయింది. ఆనకట్టను పటిష్టం చేసేందుకు అవసరమైన నిధులు లేక అప్పట్లో ఇంజనీరింగ్ అధికారులు పాలిథిన్ కవర్లు తెప్పించారు. వరద తాకిడిని తట్టుకునేలా భారీ కవర్ను దెబ్బతిన్న కట్టపై కప్పేశారు.
మరమ్మతుల కోసం నిధులివ్వలేదు..
కొమురం భీమ్ ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్న సమయంలో హడావుడిగా సాంకేతిక నిపుణుల బృందాన్ని రప్పించి ఆనకట్ట పటిష్టత, మట్టి నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక అక్టోబర్- నవంబర్ మధ్య ఆనకట్టకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు మరమ్మతుల కోసం ఒక్క అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతులు కోసం పైసా నిధులు విడుదల చేయలేదు. ఫలితంగా కొన్నాళ్లుగా ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యసంగా మారింది. పది టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు 15 ఏళ్ల కిందట నిర్మించారు. అప్పటి నుంచి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. నిధులు లేక కుడి, ఎడమ కాల్వలు నిర్మించలేదు. 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా.. ఎక్కడా కూడా సక్రమంగా నీరందివ్వలేదని స్థానికులు చెబుతున్నారు. చివరికి ప్రాజెక్టు ఆనకట్టను కూడా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడటంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.