ఈయన పిలవలేదా…? ఆయనే రాలేదా…?
-మంచిర్యాల నేతల చేరికలకు హాజరు కాని పీసీసీ చీఫ్
-ఆయనకు ఎందుకు రాలేదనే దానిపై నేతల్లో సందేహాలు
-మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు పిలవలేదా..? లేక రేవంత్రెడ్డి డుమ్మా కొట్టారా..? అని అనుమానాలు
Premsagar Rao: మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తునే ఇతర పార్టీ నేతలు చేరారు… మరి దానికి రాష్ట్ర అధ్యక్షుడు రాలేదెందుకు..? వేరే కార్యక్రమంలో ఉన్నా.. అది జరుగుతోంది కూడా అదే భవనంలో పక్కనే ఉన్నప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడు రాకపోవడానికి కారణం ఏమిటి..? మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు పిలవలేదా..? లేక ఈయన పిలిచినా రేవంత్రెడ్డి రాలేదా..? ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది.
మంచిర్యాల జిల్లాలో పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. మంగళవారం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో గాంధీభవన్ లో కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ఇంచార్జి మానిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. హాజీపూర్ జడ్పీటీసీ పుస్కురి శిల్ప, హాజీపూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ రాచకొండ ఆశాలత వెంకటేశ్వరరావు, హాజీపూర్ మాజీ ఎంపిటిసి శైలజ, హాజీపూర్ టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు దొమ్మటి సత్తయ్య , వేంపల్లి మాజీ సర్పంచ్ గోనె సంజయ్, సీనియర్ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు సిరిపురం శ్రీనివాస్, ఉప సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవరపు జితేందర్ రావు, మాల సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ సాగే సుమోహన్, బెల్లంకొండ మురళీధర్, మురళి, చిలువేరు నాగేశ్వరరావు తదితరులు పార్టీలో చేరారు.
ఇక్కడి వరకు చాలా బాగానే నడిచింది. కానీ, అసలు విషయం మాత్రం లోలోన నడిచింది. ఆ కార్యక్రమం జరుగుతున్న సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పక్కనే ఉన్నారు. వాస్తవానికి అంతకు ముందు కరీంనగర్ మానకొండూరు నుంచి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేర్చుకునే కార్యక్రమంలో సైతం పాల్గొన్నారు. ఆ తర్వాత టీపీసీసీ విస్తృతస్థాయి అత్యవసర సమావేశానికి హాజరయ్యారు. కానీ, మంచిర్యాల జిల్లా నేతలు కాంగ్రెస్లో చేరే కార్యక్రమానికి మాత్రం రాలేదు. ఒకవేళ ఆ విస్తృతస్థాయి సమావేశంలో బిజీగా ఉన్నారు… అనుకున్నామాణిక్రావు ఠాక్రే ఈ చేరికల కార్యక్రమం అనంతరమే అత్యవసర సమావేశానికి హాజరయ్యారు.
అంటే ఖచ్చితంగా ఈ చేరికల కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు రాష్ట్ర అధ్యక్షుడిని పిలవకపోవడం అయినా జరిగుండాలి..? లేదా..? ఈయన పిలిచినా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కార్యక్రమానికి రాకుండా అయినా ఉండాలి. ఇందులో ఏం జరిగిందనే విషయంలో నేతలు, కార్యకర్తలు తర్జనభర్జన పడుతున్నారు. ఈ విషయంలో ప్రేంసాగర్ రావు పంతాలు, పట్టింపులు తెలిసిన నాయకులు మాత్రం ఆయనే చెప్పి ఉండకపోవచ్చనే విషయాన్ని చెబుతున్నారు. ప్రేంసాగర్ రావు రాష్ట్ర అధ్యక్షున్ని పిలవకుండా కార్యక్రమం చేయడం సరికాదనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ రేపు గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి అండదండలు లేకుండా ఏం చేస్తారని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మరి ప్రేంసాగర్ రావు ఏం చేస్తారో వేచి చూడాలి.