ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా వెంకటయ్య
Telangana: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్, సభ్యులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా బక్కి వెంకటయ్యను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్ గా మెదక్ జిల్లాకు చెందిన బక్కి వెంకటయ్య, సభ్యులుగా.. కుస్రం నీలాదేవి (ఆదిలాబాద్), రాంబాబు నాయక్ (దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ (కరీంనగర్), శంకర్ (నల్గొండ), రేణిగుంట ప్రవీణ్ (ఆదిలాబాద్)ను నియమించారు. బక్కి వెంకటయ్య టీడీపీ హయాంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దుబ్బాక జడ్పీటీసీగా టీడీపీ తరపున ఎన్నికయ్యారు. ప్రస్తుతం మిరుదొడ్డి మండల సహకార సంఘం అధ్యక్షునిగా డీసీసీబీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల తరువాత 2015 లో తెరాస లోకి వచ్చిన బక్కీ వెంకటయ్య ఎమ్మెల్యే పదవిని ఆశించారు.ఆందోల్ నియోజక వర్గ తెరాస అభ్యార్టిగా ప్రచారం జరిగింది. జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ కు ఆ టిక్కెట్టు దక్కడంతో నిరాశకు గురయ్యారు. వెంకటయ్య ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమిస్తూ 2018 ఫిబ్రవరి 26న జీవో జారీ కాగా.. వారి మూడేళ్ల పదవి కాలం పూర్తయింది. అనంతరం పాత కమిషన్ పదవి కాలాన్ని పొడిగించడం గాని, కొత్త కమిషన్ నియామకం చేపట్టడం గాని చేయలేదు. దీంతో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అందే ఫిర్యాదుల పరిష్కారానికి అవకాశం లేకుండా పోయింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ పోస్టులను భర్తీ చేయకపోవడం పై హైదరాబాద్ కి చెందిన సోషల్ వర్కర్ గణేష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్ ను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్ ల డివిజన్ బెంచ్ గత వారం విచారించింది. అయితే పది వారాల గడువు ఇస్తే నియామక ప్రక్రియ పూర్తి చేసి రిపోర్టు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంపై స్పందించిన హైకోర్టు ఒప్పుకోలేదు. పది రోజులలో నియామకాలపై ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.