మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ దాడులు
Gaddm Vivek: మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఐదు గంటలకు ఆయన ఇంటికి చేరుకున్న ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. వివేక్‌కు చెందిన కంపెనీల నుంచి పెద్ద ఎత్తున చెన్నూరుకు డబ్బులు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గడ్డం వివేక్ సూటుకేస్ కంపెనీలు పెట్టి వాటి ద్వారా డబ్బులు చెలామణి చేస్తున్నారని వివేక్ పై బీఆర్ఎస్ నేత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వివేక్ కంపెనీ నుంచి ఒక సూట్ కేసు కంపెనీకి ఎనిమిది కోట్లు బదిలీ చేశారని ఆరోపించారు. ఈ సూట్ కేసు కంపెనీలో ఇద్దరు డైరెక్టర్లు వివేక్ కంపెనీ ఉద్యోగులని స్పష్టం చేశారు. ఆయన ఈ విషయంలో ఈడీ, ఆదాయ పన్ను శాఖలతో పాటు ప్రత్యేక వ్యయ పరిశీలకునికి సైతం ఫిర్యాదు చేశారు.
మరోవైపు, వివేక్ ఉద్యోగులు తరలిస్తున్న రూ.50 లక్షలు రూపాయలు పట్టుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. వివేక్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్, వెలుగు పత్రిక ఉద్యోగి ఇద్దరూ కలిసి రూ.50 లక్షలు తరలిస్తుండగా హైదరాబాద్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ డబ్బులను విశాఖ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రాఘవేంద్రరావు ఆదేశాల మేరకు తరలిస్తున్నట్లు ఇద్దరూ అంగీకరించారు. విశాఖ ఇండస్ట్రీస్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ కంజుల రవికిషోర్, వెలుగు పత్రిక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ముదిగంటి ప్రేంకుమార్ ఈ డబ్బులను చెన్నూరుకు తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేయడం కలకలం రేపుతోంది. మంచిర్యాలతో పాటు హైదరాబాద్‌లో వివేక్, వినోద్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వారితో పాటు ఆయన కూతురు ఇంట్లో సైతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కొందరు కార్యకర్తలు వివేక్ ఇంటి వద్దకు చేరుకుని ఐటీ అధికారులు వెళ్లిపోవాలని ఆందోళన చేస్తున్నారు.