మంత్రి పదవి దక్కెదెవరికో..?
Who has the post of minister..? : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి వస్తుందనే విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆ పదవి కోసం ప్రయత్నిస్తున్న వారిలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు.. చేస్తున్నారు కూడా… అయితే వీరిద్దరిలో పదవి ఎవరికి అనే సస్పెన్స్ మాత్రం ఎన్నో రోజులుగా వీడటం లేదు. అధిష్టానం అపరకుబేరుడి వైపు నిలబడుతుందా..? లేక పార్టీని కష్టకాలంలో ఆదుకుని ఒంటరిగా నిలబడి కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చిన వ్యక్తి వైపా…? అనేది తేలాల్సి ఉంది… బుగ్గకారు..ఎస్కార్ట్ ఎవరి ఇంటి ముందు ఉండబోతుంది. .నాంది స్పెషల్ స్టోరీ..
మంత్రి పదవికి కోసం తూర్పు జిల్లా నేతల మధ్య పోటీ తీవ్రతరం అయింది.. నువ్వానేనా అన్నట్టుగా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు… వీరి లెక్కలు ఎలా ఉన్నా అధిష్టానం ఎవరికి మంత్రి పదవి అనే విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపనుంది అనే విషయంలో చర్చ సాగుతోంది. అమాత్యా యోగం ఎవరిదనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంచిర్యాలకు మంత్రి పదవి వచ్చినట్టే.. కాని ఎవరికి అనేది ప్రస్తుత ప్రశ్న..
అధిష్టానం కసరత్తు..
రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రి పదవుల పందేరం సాగుతోంది.. బుగ్గ కారు కోసం నేతలు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మంత్రి పదవి లొల్లి కాస్త గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేరింది . ఏఐసీసీ ఎవరికి ఓకే చెప్పితే వారికే పదవి వరించబోతోంది. రాష్ట్రంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ దఫాలో వాటిని భర్తీ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అధిష్టానం డిల్లీ స్థాయిలో దఫదఫాలుగా కసరత్తు మొదలు పెట్టింది. అయితే ఈసారి ఆ వ్యవహారం ఓ కొల్కివచ్చిందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతుంది…ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మాత్రం మంత్రి పదవి కోసం పోటీ తీవ్రంగా మారింది. కష్టకాలంలో పార్టీని కాపాడిన ప్రేమ్ సాగర్ రావ్ ఒకవైపు వివేక్ సోదరులు మరో వైపు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈముగ్గురు నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. వీళ్ల ప్రయత్నాలు గట్టిగానే చేస్తుండగా అధిష్టానం సైతం వాళ్ల రాజకీయ చరిత్ర,పార్టీకి చేసిన సేవలను లెక్కలు తీస్తున్నారనే చర్చ సాగుతోంది.
అటు అపరకుబేరుడు.. ఇటు పార్టీ నిలబెట్టిన ఘనుడు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి పదవి రావడం పక్కా అనే సంకేతాలను పార్టీ ఇప్పటికే ఇవ్వగా మొదటి దఫాలో ఉమ్మడి జిల్లాకు చోటు దక్కలేదు. ఈసారి మాత్రం బెర్తు పక్కా అంటున్నారు నేతలు. అయితే ఉమ్మడి జిల్లాలో పది స్థానాలకు కేవలం 4 స్థానాల్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఎన్నికల ముందే పార్టీలోకి వచ్చారు..ఇక మంచిర్యాల లో ప్రేమ్ సాగర్ రావ్ ,చెన్నూర్ లో వివేక్, బెల్లంపల్లిలో వినోద్ గెలిచారు..ప్రేమ్ సాగర్ రావ్ ముందునుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. వినోద్ , వివేక్ ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక్క పార్టీలో ఉన్నారు. పలు పార్టీలు మారిన వీరు చివరకు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినోద్, వివేక్ కాకా కుటుంబం అనే కారణంతోనే రెండు టికెట్లు దక్కించుకున్నారు. సోదరులిద్దరు పార్టీలో చేరడం అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది అధిష్టానం…కాంగ్రెస్ జోష్ తో పాటు పటిష్టమైన క్యాడర్ శ్రమతో ఆ ఇద్దరు గెలిచారు. ఇక ప్రేమ్ సాగర్ రావ్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పటికీ ఆయన పార్టీతో అంటిపెట్టుకోని ఉండడమే కాదు ఉమ్మడి జిల్లాలో పార్టీని కాపాడారు. పార్టీ కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కోన్నారనేది సొంత పార్టీ క్యాడర్ చెబుతున్నారు.
కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను గట్టెక్కించారు..
పార్టీకోసం పనిచేయడమే కాదు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను గట్టెకించిది ఎవరంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రేమ్ సాగర్ రావ్ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే పార్టీలో ఏమి లేదని చాలామంది అధికార పార్టీ బీఆర్ఎస్ లోకి, బీజేపీలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నది పీఎస్ ఆర్. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి మొదటి సభ ఇంద్రవెల్లి దండోరా. ఆ సభను విజయవంతం చేసి, రేవంత్‌రెడ్డితో శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత పిప్పిరి నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభిస్తే ఉమ్మడి జిల్లాలో 30 రోజుల సుదీర్షకాలం సాగిన యాత్రను సక్సెస్ చేసి రాష్ట్రం కాంగ్రెస్ బతికే ఉందనే సంకేతాలను మిగతా పార్టీలకు పంపించగలిగారంటే అది ఉమ్మడి జిల్లాలోని నేతల చలువే. భట్టి పాదయాత్రలో భాగంగా మంచిర్యాల నిర్వహించిన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గేను తీసుకొచ్చి భారీ బహిరంగ సభను విజయవంతం చేయగలిగారు. మంచిర్యాల సభ పాదయాత్ర, రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి దండోరాతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరు తెచ్చుకున్నది పీఎస్ఆర్.
ఒక ఇంటి నుంచి ముగ్గురు.. మళ్లీ మంత్రి పదవా..?
ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఆయన సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరికి టిక్కెట్టు ఇచ్చిన అధిష్టానం ఆ తర్వాత వివేక్ కుమారుడు వంశీకి సైతం పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చింది.ఇక మళ్లీ అదే కుటుంబంలో మంత్రి పదవి కోసం పోటీ పడుతుండటం సొంత పార్టీ నేతలతో పాటు క్యాడర్ కు సైతం నచ్చడం లేదు. ఇప్పటికే కుటుంబ పాలన అనే పేరు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరికి ఎమ్మెల్యే టిక్కెట్లు, వారి కుమారుడికి ఎంపీ టిక్కెట్టు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మళ్లీ వారిలో ఒకరికి మంత్రి ఇవ్వడం అంటే అటు పార్టీ శ్రేణులకు, ఇటు ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి రోజూ ఇదే వాదన సాగుతోంది. మరి అధిష్టానం పార్టీ విధేయత చూస్తుందా…? పైసల బలం చూస్తుందా…? అనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.