అన్ని జీఎం కార్యాల‌యాల ఎదుట ఆందోళ‌న

Singareni: సింగరేణివ్యాప్తంగా 26న అన్ని జీఎం కార్యాలయాల ముందు నిర్వ‌హించే ధర్నా జయప్రదం చేయాల‌ని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ అధ్య‌క్షుడు యాదగిరి సత్తయ్య విజ్ఞప్తి చేశారు. మంగ‌ళ‌వారం రామగుండం ఏరియా III, OCP-I ప్రాజెక్టుపై నిర్వ‌హించిన గేట్ మీటింగ్ లో ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్త బొగ్గుగని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణిలో ఆందోళనలను నిర్వ‌హిస్తున్నామ‌ని దానిలో భాగంగా 26న జీఎం కార్యాలయాల ముందు ధర్నా నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.

రాష్ట్రప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావలసిన ఆంధ్రప్రదేశ్ జెన్కో, తెలంగాణ జెన్కో, విద్యుత్తు బొగ్గు బకాయిలు చెల్లించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యం కోసం సింగరేణి ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి ఆసుప‌త్రుల‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులు దీర్ఘకాలిక వ్యాధులతో అవస్థలు పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పారిశ్రామిక సత్సంబంధాల విధానాన్ని అన్ని బొగ్గు గనులలో ఒకే పద్ధతిలో ఉండాలని సింగరేణిలో కూడా చెకప్ సిస్టం ప్రవేశపెట్టాలన్నారు. వేతన ఒప్పందం-11లోని ఒప్పందాలను వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓవర్ మెన్, మైనింగ్ సర్దార్, డాటా ఎంట్రీ ఆపరేటర్ జనరల్ మజ్దూర్, బదిలీ వర్కర్, కార్మికుల డెసిగ్నేషన్ వెంటనే మార్చేందుకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంస్థ పరంగా లాభాలు రూ.4,701 కోట్లు కాగా, అందులో 33శాతం వాటా రూ.1551 కోట్లు కార్మికుల‌కు చెందాల‌న్నారు. కేవ‌లం 16 శాతం మాత్ర‌మే లాభాలు చెల్లిస్తున్నార‌ని ఇది స‌రికాద‌న్నారు. ఏరియా ఉపాధ్యక్షులు అరుకాల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పొన్నమనేని వేణుగోపాలరావు, కేంద్ర కార్యదర్శి మాదాసి రవీందర్, ఏరియా కార్యదర్శి రౌతు రమేష్, పిట్ కార్యదర్శి రాజమహేందర్ రెడ్డి, శ్రీనివాస్, కట్కూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like