‘దేవర’ థియేటర్‌లో విషాదం
‘దేవర’ రిలీజ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్న వేళ.. కడప జిల్లా అప్సర థియేటర్లో పెను విషాదం చోటు చేసుకుంది. థియేటర్లో ‘దేవర’ సినిమా చూస్తున్న ఎన్టీఆర్ అభిమాని ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతిచెందాడు. అయితే కడప జిల్లాలో ‘దేవర’ రిలీజ్ సందర్భంగా అప్సర థియేటర్లో అభిమానుల కోసం ఫ్యాన్స్షో వేశారు. దీంతో సినిమా చూస్తున్న ఫ్యాన్స్ విజిల్స్, కేకలు వేస్తూ హంగామా చేస్తుండగా ఒక్కసారిగా ఓ అభిమాని కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన ఎన్టీఆర్ అభిమానిని సీకే దీన్నే మండలం జమాల్ పల్లికి చెందిన మస్తాన్ వలిగా గుర్తించారు.
కడప జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న రాజా థియేటర్‌లో మిడ్‌నైట్ షో సందర్భంగా అభిమానులకు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. షో సందర్భంగా జనం విపరీతంగా రావడంతో టిక్కెట్టు లేని వారు సైతం థియేటర్ లోపలికి దూసుకువెళ్లారు. టిక్కెట్టు లేకుండా లోనికి వెళ్లేవారిని అదుపు చేయడంలో థియేటర్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో కొందరు యువకులు వారిపై దాడి చేశారు. దీంతో అక్కడ గొడవ మొదలయ్యింది. పోలీసులు కలుగచేసుకుని టిక్కెట్టు లేని వారిని బయటకు పంపించేశారు.