డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ

Deputy CM Bhatti Vikramarka : హైదరాబాద్ నగరంలో వీఐపీల ఇళ్లలో వరుసచోరీలు జరుగుతున్నాయి. మొన్న హీరో మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరగ్గా.. తాజాగా ఏకంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. ఈ రెండు ఘటనల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రభుత్వంలో టాప్ 2 ప్లేస్‌లో ఉన్న భట్టి ఇంట్లోనే దొంగలు పడటం సంచలనంగా మారింది. ఆయన ఇంట్లోంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు సమాచారం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్‌ 14లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. ఈ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఖాకీలు. నిందితుల ఆచూకీ కోసం గాలించగా.. వారంతా పశ్చిమబెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించారు. నిందితులను ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు బెంగాల్ పోలీసులు. నిందితులు బీహార్‌కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ. 2.2 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంతో.. వారిని అదుపులోకి తీసుకునేందుకు బెంగాల్‌కు వెళ్లారు బంజారాహిల్స్ పోలీసులు.

ఇటీవల హీరో మోహన్ బాబు ఇంట్లో పని చేసే వ్యక్తి షాక్ ఇచ్చాడు. ఆయన ఇంట్లోనే దొంగతనం చేశాడు. నాయక్ అనే వ్యక్తి గత కొంత కాలంగా హైదరాబాద్ శివారులో జల్‌పల్లిలో మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్నాడు. ఇటీవల రాత్రిపూట దాదాపు రూ.10 లక్షల నగదుతో ఉడాయించాడు. ఇది గమనించిన మోహన్ బాబు.. వెంటనే రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 10 గంటల్లోనే నిందితుడిని తిరుపతిలో అరెస్టు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like