చదరంగంలో మహారాణులు
Chess:ఇద్దరు అక్కాచెల్లెళ్లు చదరంగంలో ప్రతిభ చాటుతూ ముందుకు సాగుతున్నారు. ఆటల్లో వెనకబడి ఉన్న ఆదిలాబాద్ జిల్లా నుంచి వీరిద్దరూ రాష్ట్రస్థాయికి ఎంపిక అవడమే కాకుండా పలువురి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన అంబటి సుకీర్తి, అద్విత అక్కా చెల్లెళ్లు. వీరిద్దరికి చిన్నప్పటి నుంచే ఆటలు అంటే ఎంతో ఇష్టం. వారి ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు వారికి చేస్ లో శిక్షణ ఇప్పించారు. వారి ప్రయత్నానికి ఇద్దరు చిన్నారుల ఉత్సాహం తోడు కావడంతో అంచెలంచలుగా ఎదుగుతూ వచ్చారు. ఇద్దరు జిల్లాస్థాయి దాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం గమనార్హం. అంబటి అద్విత జిల్లాస్థాయి అండర్15 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. బాలికల విభాగంలో అద్విత జిల్లా చాంపియన్ గా నిలిచింది. ఆమె జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ హైస్కూల్లో చదువుకుంటోంది. అండర్11 బాల బాలికల చెస్ పోటీల్లో అంబటి సుకీర్తి సైతం జిల్లా మొదటి స్థానంలో నిలవడమే కాకుండా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.
ఇంట్లో ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా తామిద్దరూ చెస్ ఆడతామని అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు. రాష్ట్రస్థాయిలో గెలుపొంది, దేశస్థాయికి ఎంపిక కావడం, ఈ దేశ తరఫున ప్రాతినిధ్యం వహించడం తమ లక్ష్యమని ఇద్దరూ చెబుతున్నారు. మొదట వారి ఉత్సాహం చూసి ప్రోత్సహించామని, తమ కూతుళ్లు ఇద్దరూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని వారి తల్లిదండ్రులు అర్చన, సారంగపాణి తెలిపారు.