నువ్వు లేకున్నా మేమున్నాం మిత్రమా..
Friends who helped the friend’s family financially: తమతో చదువుకున్న స్నేహితురాలు మృతి చెందింది. అసలే పేద కుటుంబం. ఆమెకు ఓ పాప ఉంది. తను ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. దీంతో ఆ కుటుంబానికి అండగా నిలబడాలని భావించారు స్నేహితులు. అనుకున్నదే తడవుగా తలా ఓ చేయి వేశారు. ఆ చిన్నారికి ఆర్థిక సాయం చేశారు. వారు చేసిన పనికి అంతా అభినందిస్తున్నారు.
తాండూరు మండలం మాదారం టౌన్షిప్‌కు చెందిన రజిత అనే యువతి ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో మరణించింది. ఆమెకు ఉన్న పాప సాయి చందన ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. అసలే పేద కుటుంబం. ఆమె తాత రాజిరెడ్డి మాదారం టౌన్షిప్ గ్రామ పంచాయతీలో చిరుద్యోగి. చాలీచాలని జీతం. దీనిని గమనించిన రజిత తో పాటు చదువుకున్న స్నేహితులు తలా ఓ చేయి వేశారు. మాదారం టౌన్షిప్‌లోని సింగరేణి పాఠశాల 2001-02 బ్యాచ్ విద్యార్థులు రూ. 50 వేలు జమ చేశారు. శుక్రవారం రోజు రజిత కూతురు సాయి చందన పేరుతో బ్యాంక్‌లో డిపాజిట్ చేసి ఆ బాండ్‌ను తనకి అందచేశారు.
స్నేహితురాలు మరణించినా తన స్నేహాన్ని మరిచిపోకుండా అండగా నిలబడిన వారికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు.