బద్నామ్ చేసేందుకు కుట్ర
Congress: రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుని బద్నామ్ చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం నంనూర్ లో ప్రభుత్వ ఫించన్ తీసుకున్న లబ్దిదారులు స్వచ్చందంగా ఇంటి పన్ను చెల్లిస్తే దానిని సైతం రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో వేంపల్లి మాజీ సర్పంచ్ డేగ బాపు, మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి మాట్లాడారు. ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ డబ్బులు లబ్ధిదారులకు అందించారని, ఇంటి పన్ను బకాయిలు ఉన్నాయని గ్రామ కార్యదర్శి చెప్పడంతో వెంటనే ఇంటి పన్ను చెల్లించారని అన్నారు.
ఇది గత నెలలో జరగ్గా రెండు రోజుల నుంచి అటు ప్రభుత్వాన్ని, ఇటు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును బద్నామ్ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయినా ఈ వ్యవహారం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో గ్రామ అధికారిని సస్పెండ్ చేస్తూ విచారణ కోసం డీఆర్ డీ ఏ అధికారులను ఆదేశించారని తెలిపారు. విచారణలో ఒక్కరు మాత్రమే గ్రామ అధికారికి వ్యతిరేకంగా చెప్పగా మిగతా వాళ్ళు తామే స్వచ్చందంగా ఇంటి పన్ను బకాయిలు చెల్లించామని చెప్పినట్లు సమావేశంలో స్పష్టం చేశారు. కొంత మంది గ్రామాధికారులపై తప్పుడు పనులు చేయాలని ఒత్తిడి తెచ్చినా చేయకపోవడం వల్ల కక్షకట్టి గత నెలలో జరిగిన విషయాన్ని ఈనెలలో వెలుగులోకి తేవడం దురుద్దేశపూరితం కాదా…? అని వారు ప్రశ్నించారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అవినీతిని సహించరని ఎల్లవేళలా ప్రజల పక్షాన నిలుస్తారని అన్నారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకోరని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తరుగు పేరుతో దళారులు దోచుకుంటే ప్రేంసాగర్ రావు ఎమ్మెల్యే కాగానే తరుగు పేరు లేకుండా చేశారని గుర్తు చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, అభివృద్ధి పనులు ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నాడన్నారు. ఇవన్నీ గిట్టని విపక్షాలు అసత్యపు ఆరోపణలు కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. విపక్షాలకు ప్రజల్లో ఆదరణ లేదని అందుకే లేనిపోని అంశాలను ముందుకు తెస్తున్నారని దుయ్యబట్టారు.