గూగుల్ మ్యాప్‌ని న‌మ్మితే.. న‌ట్ట‌డివిలో వ‌దిలేసింది..

Google Maps: గూగుల్‌ మ్యాప్‌ కొంపముంచింది. దాన్ని నమ్ముకున్న కొంతమంది శివస్వాములు.. దట్టమైన అడవిలో దారి తప్పారు. శ్రీశైలానికి న‌డ‌క‌దారిలో వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ ఫాలో అయిన భక్తులు చిక్కుల్లో పడ్డారు. చివరకు పోలీసు, అటవీ శాఖ అధికారుల జోక్యంతో సురక్షిత ప్రాంతానికి చేరారు. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు శివస్వాములు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కొల్లాపురం నియోజకవర్గం పెంటవెల్లి గ్రామానికి చెందిన 30 మంది శివస్వాములు.. పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. శ్రీశైలం త్వరగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్‌ను అనుసరించి షార్ట్ కట్‌లో వెళ్లేందుకు ప్రయత్నించి చిక్కుల్లో ప‌డ్డారు. అందరూ వెళ్లే మార్గంలో కాకుండా గూగుల్‌ మ్యాప్ నమ్ముకుని కాలినడకన ప్రయాణం కొనసాగించారు. మండలంలోని వెంకటాపురం గ్రామం మీదుగా ప్రయాణం కొసాగించాల్సి ఉండగా కురుకుంద, శ్రీపతిరావు పేట గ్రామం మీదుగా నల్లమల అడవుల్లోకి ప్రవేశించారు. వారికి శ్రీశైలంలోని శిఖరం గూగుల్‌ మ్యాప్‌లో చూపడంతో మ్యాప్‌ను అనుసరించి కొండల్లో ఇబ్బందులు ప‌డుతూ ప్రయాణం సాగించారు.

వీరిలో 23 మంది ఎలాగోలా బయట పడగా మరో ఏడుగురు అడవిలో దారి తప్పి నల్లమలలోని ఇందిరేశ్వరం వెస్ట్‌ బీట్‌లో ఉండి పోయారు. వెంట తెచ్చుకున్న ఆహారం, నీరు అయి పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండగా ఓ చోట వారికి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ వచ్చాయి. వెంటనే 100కు డయల్‌ చేయగా వారు స్థానిక ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. దీంతో డిప్యూటీ డిరెక్టర్‌ సాయి బాబాకు ఫోన్‌ చేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ఆయన ఎఫ్‌ఎస్‌వో, ఎఫ్‌బీవో మద్దిలేటితో పాటు మరి కొందరిని వారిని గుర్తించేందుకు పంపించారు. ఎట్టకేలకు రాత్రి 9 గంటల సమయంలో శివస్వాముల లొకేషన్ గుర్తించి వారిని అటవీ శాఖ వాహనంలో అధికారులు ఆత్మకూరుకు చేర్చారు. దీంతో వారు అటవీ శాఖ అధికారులకు కృతజ్ఙతలు తెలిపారు. శ్రీశైలానికి వచ్చే శివ స్వాములు, భక్తులు అటవీ శాఖ అధికారులు సూచించిన మార్గంలోనే వెళ్లాలని.. గూగుల్ మ్యాప్ లేదా వేరే ఇతర వ్యక్తులను నమ్మి వెళ్తే ప్రమాదాల బారిన పడతారని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like