నామినేటేడ్ ప‌ద‌వుల భ‌ర్తీకి రంగం సిద్ధం

Filling up of nominated posts in Telangana : తెలంగాణలో మ‌రోమారు నామినేటెడ్ పోస్టుల వ్య‌వ‌హారం తెర పైకి వ‌చ్చింది. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వీటిపై ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఆ పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. తెలంగాణలో త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్ర‌వారం ఆయ‌న నేత‌ల‌తో మాట్లాడుతూ వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల‌ని, మార్చి 10వ తేదీలోగా అన్ని జిల్లాలలో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. పార్టీ కోసం సుదీర్ఘకాలం కష్టపడి పనిచేసినా.. కొంతమందికి అవకాశాలు రాలేదని, రాబోయే రోజుల్లో వారికి తప్పకుండా ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన వారి పేర్లతో మార్చి 10లోగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు ప్రతిపాదనలు పంపాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తైపోయింది. ఓవైపు సంక్షేమ పథకాలను పట్టాలెక్కించే పనిలో ఉంటూనే.. మరోవైపు రాజకీయంగానూ బలపడే అవకాశాలపై ఫోకస్ పెడుతూ వస్తోంది. త్వరలోనే స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పాగా వేసి… గ్రౌండ్ లో మరింత బలపడాలని భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచి.. పార్టీలోని చాలా మంది నేతలు పదవులపై ఆశలు పెంచుకున్నారు. రేపు మాపు అంటూ భర్తీ ప్రకటనలు వస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ముహుర్తం మాత్రం ఖరారు కాలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… కొన్ని పదవులను భర్తీ చేశారు. అయితే ఇంకా చాలా కార్పొరేషన్లతో పాటు జిల్లా, నియోజకవర్గస్థాయిలో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. పార్టీ కోసం పని చేసిన నేతలను గుర్తించి… పదవులను ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని పదే పదే అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్య‌మంత్రి చెప్ప‌డంతో నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం పలువురు నేతలు రాష్ట్ర పెద్దలతో పాటు ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం దాదాపు వందమందికిపైగా నేతలు కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 50 నుంచి 60వరకు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వాటిపైన క‌న్నేసిన నేత‌లు త‌మ గాడ్‌ఫాద‌ర్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ నామినేటెడ్ పోస్టులు ద‌క్కించుకోవాల‌ని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

నామినేటెడ్ పదవులే కాదు… పార్టీ కార్యవర్గంలోనూ మార్పులు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ క‌స‌ర‌త్తు ప్రారంభించింది. పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి… కొత్త నియామకాలను చేపట్టాలని టీపీసీసీ భావిస్తోంది. అయితే నామినేటెడ్ పదవులతో పాటే కార్యవర్గంలో కూడా మార్పులు చేసే విషయంపై అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిస్తోంది. ఇటీవలే మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్… నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ఓ ప్రకటన కూడా చేశారు. అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ రాగానే…. ఈ ప్రక్రియ పట్టాలెక్కుతుందని చెప్పుకొచ్చారు. ఏడాది గ‌డుస్తున్నా అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో పదవుల భర్తీ ఆలస్యం అవుతుండటంతో పార్టీలోని నేతలు పూర్తి నిరాశ నిస్పృహలో ఉన్నారని అటు ప్ర‌భుత్వం, ఇటు అధిష్టానం గ్ర‌హించింది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందే.. నామినేటెడ్ పోస్టుల భర్తీని పూర్తి చేయాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

అధినాయ‌క‌త్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో నేత‌లు మ‌ళ్లీ అల‌ర్ట్ అయ్యారు. అటు పార్టీప‌రంగా, ఇటు ప్ర‌భుత్వం ప‌రంగా భ‌ర్తీ చేస్తుండ‌టంతో ఏదో ఒక‌టి సంపాదించుకోవాల‌ని ఉవ్విళూరుతున్నారు. పదవులు ఆశిస్తున్న నేతలు… ఎవరికి వారుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కింది స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పావులు కదుపుతున్నారు. ఎలాగైనా పదవి దక్కించుకోవాలని… రాజకీయంగా బలపడాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఆశల పల్లకిలో ఉన్న నేతల్లో ఎంత మందిని అదృష్టం వరిస్తుందో చూడాలి…!

Get real time updates directly on you device, subscribe now.

You might also like