ఆ ముగ్గురు నేతలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
kaleswaram commission: తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అవకతవకలు, నిర్మాణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీ.సీ. ఘోష్ కమిషన్ మరో కీలక అడుగు వేసింది. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5 లోపు తమ ముందు విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో తేదీ కేటాయించి ఆ రోజు విచారణకు రావాలని సూచించింది. కేసీఆర్ జూన్ 5, హరీశ్ రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవకతవకలు జరిగాయని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణకు కమిషన్ నియమించిన విషయం తెలిసిందే. జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు, ఇంజినీరింగ్ ఇతర విభాగాలకు సంబంధించి విచారణ జరిపింది.
గడువు పెంచిన తెల్లవారే…
వాస్తవానికి, కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ గడువు ఈనెల 31తో ముగియనుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ గడువును రెండు నెలలు పొడిగించింది. జులై 31వరకు పొడిగిస్తూ సోమవారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ నివేదిక అందజేసేందుకు సిద్ధమైంది. అధికారులు, ఇంజనీర్లను విచారించి నివేదికకు తుది మెరుగులు దిద్దుతోంది. వాస్తవానికి కేసీఆర్, హరీష్‌రావు, ఈటెల రాజేందర్ ను విచారణకు పిలవరని అంతా భావించారు. కానీ, ప్రభుత్వం అకస్మాత్తుగా కమిషన్ విచారణ గడువు పెంచడమే కాకుండా, ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించి నాటి సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ ను విచారణకు రావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది.