రాజ్యాంగం స్ఫూర్తితో పనిచేయాలి
జిల్లా సంక్షేమాధికారి ఉమాదేవి
దేశంలోనే అతి పెద్ద లిఖిత గ్రంథం మన భారత రాజ్యాంగమని మంచిర్యాల జిల్లా సంక్షేమాధికారి మాస ఉమాదేవి అన్నారు. శుక్రవారం జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో సిబ్బందితో కలిసి 72వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డా. బి.అర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నా దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగ మనదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రజల అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లి పేద ప్రజల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత మనదని స్పష్టం చేశారు. అనంతరం సిబ్బందితో భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించారు.