జిమ్లో స్టెరాయిడ్స్
Steroids in the gym: డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు జిమ్ నిర్వాహకులు యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దేహదారుఢ్యం కోసం వచ్చే వారికి స్టెరాయిడ్తో కూడిన రక్తపోటు పెంచే ఇంజక్షన్లు సరఫరా చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్తే.. ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగడమే కాకుండా కొన్ని సార్లు ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ జిమ్లో గురువారం స్టెరాయిడ్స్ దొరికాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ లోని లయన్ ఫిట్నెస్ జిమ్ లో సోదాలు నిర్వహించారు. ఈ జిమ్ నిర్వాహకుడు షేక్ ఆదిల్ స్వయంగా డ్రగ్స్ సేవించడమే కాకుండా, జిమ్ క్లయింట్లకు స్టెరాయిడ్లు నిషేధిత ఇంజెక్షన్లను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా 36 స్టెరాయిడ్ టాబ్లెట్లు, మూడు సిరంజిలు, 20ml AMP డ్రగ్ ఇంజెక్షన్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ I టౌన్ పోలీస్ స్టేషన్లో షేక్ ఆదిల్ పై U/S 125 BNS, 27(B)(ii) DCA చట్టం కింద కేసు నమోదు చేసినట్లు DSP ఎల్. జీవన్ రెడ్డి వెల్లడించారు. ఫిట్నెస్ పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలను సహించేది లేదని ఆయన హెచ్చరించారు. RDO ఆదేశాల మేరకు జిమ్ సీజ్ చేశామని, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేశారు. ఈ మేరకు పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు.