కాంగ్రెస్ వల్లే భారత్‌కు కష్టాలు
Modi Fires On Congress: కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పుల వల్లే భారతదేశం కష్టాలు పడుతోందన్నారు ప్రధానమంత్రి మోదీ. ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడుతున్న సందర్భంగా ఆయన కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలను పార్లమెంట్లో ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలోనే భారతదేశం పీఓకేను కోల్పోయిందన్న విషయాన్ని గుర్తు చేశారు. నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందన్నారు. అక్సాయ్ చిన్ కు బదులుగా, మొత్తం ప్రాంతాన్ని బంజరు భూమిగా ప్రకటించారని ఇది ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. దీని కారణంగా మనం దేశంలోని 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోవలసి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
1962-1963 మధ్య కాంగ్రెస్ నాయకులు జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, ఉరి, నీలం లోయ, కిషన్జంగాలను వదులుకోవాలని ప్రతిపాదించారన్నారు. 1966లో కాంగ్రెస్ నేతలు రాన్ ఆఫ్ కచ్ పై మధ్యవర్తిత్వాన్ని అంగీకరించడంతో మరోసారి 800 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు అప్పగించారన్నారు. 1965 యుద్ధంలో హాజీ పీర్ పాస్ ను మన సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుందని కానీ కాంగ్రెస్ తిరిగి ఇచ్చిందన్నారు. 1971లో యుద్ధం సందర్భంగా మన దగ్గర పాకిస్థానీ సైనికులు 93 వేల మంది ఖైదీలుగా ఉన్నారని చెప్పారు. భారత సైన్యం వేల చదరపు కిలోమీటర్ల పాకిస్థాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుందని ప్రధాని మోడీ తెలిపారు.
ఆ సమయంలో దృష్టి సారించి ఉంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)ని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉండేదన్నారు. ఆ అవకాశాన్నివదులుకున్నారని తెలిపారు. కనీసం కర్తార్‌పూర్ సాహిబ్‌ను సైతం తిరిగి సొంతం చేసుకోలేక పోయారన్నారు. 1974లో కచ్చితీవును శ్రీలంకకు బహుమతిగా ఇచ్చారని.. ఇప్పటికీ భారతీయ జాలర్ల ప్రాణాలకు అక్కడ ప్రమాదం పొంచి ఉందన్నారు. దశాబ్దాలుగా, సియాచిన్ నుంచి సైన్యాన్ని తొలగించాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పనిచేస్తోందని.. 2014 లో దేశం వారికి అవకాశం ఇవ్వలేదన్నారు. లేకుంటే నేడు మనకు సియాచిన్ కూడా ఉండేది కాదన్నారు.