మూడు నెల‌ల్లో తేల్చండి..

Supreme Court: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల‌ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. తీర్పు వచ్చిన తర్వాత మూడు నెలలకు మించకుండా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏండ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్‌లో ఉంచడం సరికాదని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయ‌ప‌డింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సైతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది.

తెలంగాణ ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరారు. దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌, ప్రకాశ్‌గౌడ్ ఆ పార్టీలో చేర‌గా, వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్‌, పాడి కౌశిక్‌రెడ్డి స్పెషల్‌ లీవ్‌ పిటిషన్ వేయ‌గా, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు… స్పీకర్‌కు కోర్టులు సూచనలు చేయడం…. దానికి కాలపరిమితి విధించే అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా? అన్న అంశంపై సుప్రీంకోర్టు.. వాద‌న‌లు విన్న‌ది. మూడు రోజులపాటు వరుసగా దీనిపై వాదనలు నడిచాయి. తుది తీర్పును రిజర్వు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ఏప్రిల్ 3 న ప్రకటించింది. దేశంలోని రెండు రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన అంశం కావడంతో సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం.. మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సూచిస్తూ తీర్పును వెలురించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like