వెంటాడి.. వేటాడి చంపుతున్నరు…
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను మట్టుబెడుతున్న సైన్యం
Army killing terrorists in Jammu and Kashmir:కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, భద్రతా దళాలు ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా ఆరు వేర్వేరు ఎన్కౌంటర్లలో 21 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లలో విదేశీ, స్థానిక ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నాయి. వివిధ ఎన్కౌంటర్లలో మరణించిన వారిలో పన్నెండు మంది పాకిస్తాన్ జాతీయులు కాగా, తొమ్మిది మంది స్థానికంగా నియమించబడినవారే. ఈ ఆపరేషన్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో మొత్తం క్రియాశీల స్థానిక ఉగ్రవాదుల సంఖ్య తగ్గింది.
పహల్గాంలో ఉగ్రవాదుల జరిగిన అనంతరం సాంబా సెక్టార్లో నిర్వహించిన ఎన్కౌంటర్లో జైష్-ఎ-మొహమ్మద్ మాడ్యూల్ కు చెందిన ఏడుగురు జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాదులను హతమార్చారు. వీరంతా పాకిస్తానీ జాతీయులు. ఇక ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో షోపియన్‌లోని కెల్లార్ అటవీ ప్రాంతంలో జరిగింది. లష్కరే తోయిబా సెల్ కు చెందిన ముగ్గురు కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీ దార్, అమీర్ బషీర్‌లను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఇక మూడవ ఎన్కౌంటర్ ట్రాల్ అడవుల్లో జరిగింది. దీనిలో జైష్-ఎ-మొహమ్మద్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. అవంతిపోరా జిల్లా కమాండర్ ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వాని, యావర్ అహ్మద్ భట్ లను చంపేశారు. ఈ ఉగ్రవాదులు దక్షిణ కాశ్మీర్లో స్లీపర్ సెల్‌లను తిరిగి సక్రియం చేయడంలో పాల్గొన్నట్లు సమాచారం.
కీలకమైన ఆపరేషన్ మహదేవ్ పేరిట చేపట్టిన భద్రతాల దళాలు పహల్గాం దాడులకు కీలక సూత్రధారులను లేపేశాయి. ముల్నార్ గ్రామంలో ఆపరేషన్ మహాదేవ్ కింద ముగ్గురు పాకిస్తానీ ఎల్ఈటి ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో సులైమాన్, ఆఫ్ఘన్, జిబ్రాన్ ఉన్నారు. ఇక పూంచ్ సెక్టార్లో ఆపరేషన్ శివశక్తి ఆపరేషన్‌లో ఇద్దరు పాకిస్తానీ ఎల్ఈటి ఉగ్రవాదులు హతమయ్యారు. వారి పేర్లు బహిరంగంగా వెల్లడించకున్నా.. వారు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) నుండి దాటి వచ్చిన చొరబాటుదారులని అధికారులు నిర్ధారించారు. ఆపరేషన్ అఖల్ అనే కోడ్‌నేమ్ ఉన్న ఈ తాజా ఆపరేషన్ శ్రీనగర్ నుండి దాదాపు 70 కి.మీ దూరంలో ఉన్న కుల్గామ్‌లో జరిగింది. దీని ఫలితంగా ముగ్గురు లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదులు హతమయ్యారు. జాకీర్ అహ్మద్ గని, ఆదిల్ రెహమాన్ డెంటు, హరీష్ దార్లను ఎన్కౌంటర్ చేశారు.
నిఘావర్గాల సమాచారం ప్రకారం, దాదాపు ఆరుగురు ఉగ్రవాదులు చురుకుగా పనిచేస్తున్నారని గుర్తించారు. స్థానిక నియామకం, సరిహద్దు చొరబాటుదారులకు లాజిస్టికల్ మద్దతును ప్లాన్ చేయడం కోసం ఈ గ్రూప్ ఇటీవల తిరిగి సక్రియం చేయబడిందని భద్రతా దళాలు తెలిపాయి.