అంతా మా ఇష్టం
-సింగరేణిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు
-కార్మికులకు క్వార్టర్ల కేటాయింపులో అవకతవకలు
-అర్హత లేని వారికి ఇచ్చి, అర్హులకు మొండి చేయి
-చర్యలు తీసుకోవాలని కోరుతున్న సింగరేణి కార్మికులు
Singareni: సింగరేణి సంస్థలో కొందరు అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తాము ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది పరిస్థితి. నిబంధలనకు విరుద్ధంగా పనిచేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా క్వార్టర్ల కేటాయింపు విషయంలో కొందరు అధికారులు నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సింగరేణి మందమర్రి ఏరియాలో అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు క్వార్టర్లు కేటాయిస్తున్నారు. తమకు నచ్చితే జూనియర్లకు సైతం క్వార్టర్లు కేటాయిస్తుండగా, నచ్చకపోతే నిబంధనల పేరుతో తిప్పించుకుంటున్నారు. బెల్లంపల్లి పట్టణంలో ఎలాంటి అర్హత లేని ఈ గ్రేడ్ ఎస్అండ్‌పీసీ సెక్యూరిటీ గార్డుకి ఏకంగా సీ టైప్ క్వార్టర్ కేటాయించారు. ఈ క్వార్టర్ గురించి నోటీసు బోర్డులో పెట్టకుండా, కౌన్సెలింగ్ లేకుండా కేటాయించారంటే అధికారులు ఏ స్థాయిలో వ్యవహరిస్తున్నారో అర్థం అవుతుంది. ఆ సెక్యూరిటీ గార్డు క్వార్టర్లకు సంబంధించి వ్యవహారం చూస్తాడని అందుకే అతనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మందమర్రి డివిజన్ డిపెండెంట్ ఉద్యోగిగా నియమితుడైన ఓ జనరల్ అసిస్టెంట్ కార్మికుడికి సైతం సీ టైప్ కేటాయించారు. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అప్పుడు అలా… ఇప్పుడు ఇలా…
బెల్లంపల్లిలో ఎస్అండ్ పీసీ జమేధార్‌గా విధులు నిర్వహించిన ఓ ఉద్యోగి సీ టైప్ క్వార్టర్‌లో ఉంటున్నాడని అతనిపై చర్యల కింద బదిలీ వేటు వేశారు. తనకు సమయం కావాలన్నా వినకుండా పంపించివేశారు. అప్పుడు అంత చురుకుగా వ్యవహరించిన అధికారులు మరి ఇప్పుడు అనర్హులకు క్వార్టర్లు ఎలా కేటాయించారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదంతా ఒక్కెత్తు కాగా, విజిలెన్స్ విభాగానికి ఒకరు ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేయగా, ఆ వ్యవహారం కాస్తా లీకైంది. దీంతో ఫిర్యాదు చేసిన వ్యక్తికే కొందరు ఫోన్లు చేసి అన్నా మనోడే ఫిర్యాదులు చేయవద్దంటూ చెప్పడం కొసమెరుపు.
అనుమతులు లేకుండానే సింగరేణి క్వార్టర్లలో..
బెల్లంపల్లి ఏరియాలో ఉన్న సింగరేణి క్వార్టర్లలో చాలా మంది పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు అనుమతులు లేకుండానే ఉంటున్నారు. జీఎం కార్యాలయంలో ఉండే కొందరు ఉద్యోగులు వారికి సహకరిస్తున్నారు. దీంతో సింగరేణికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. కొందరు ఎస్ అండ్ పీసీ సిబ్బంది వారి వద్ద డబ్బులు తీసుకుని ఉదాసీనంగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే అధికారులు వారికి వంత పాడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.