నలుగురిని మింగిన నీటి కుంట
Four people die after falling into a puddle:ఓ నీటి కుంటలో పడి నలుగురు మృత్యువాత పడ్డారు. గ్రామం మొత్తాన్ని విషాదంలో నింపిన ఈ ఘటన కొమురం భీమ్ జిల్లాలో చోటు చేసుకుంది. కొమురం భీమ్ జిల్లా వాంకిడి మండలం డాబా గ్రామంలోని నీటిగుంతలో పడి ఓ మహిళ, ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మోర్లే బుజ్జి బాయి అనే మహిళ పొలం వద్ద పనిచేస్తున్న సమయంలో ఆమె కుమారుడు గన్నుతోపాటు మహేశ్వరి, శశికళ అనే మరో ఇద్దరు బాలికలు నీటి కోసం ఓ కుంట వద్దకు వెళ్లారు. అనంతరం వారంతా కుంటలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో చిన్నారులు నీటిలో మునిగిపోయారు. అది గమనించిన మహిళ.. చిన్నారులను రక్షించేందుకు నీటి గుంతలోకి దిగింది. గుంతలో నీరు, బురద ఎక్కువగా ఉండటంతో ఆమెతో సహా పిల్లలంతా ఇరుక్కుపోయారు. చివరికి ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారిని మోర్లే బుజ్జి బాయి (35), మోర్లే గన్ను(12), వాడే మహేశ్వరి(9), అదే శశికళ(9)గా గుర్తించారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.