తిరిగి కారెక్కిన కోనేరు బ్రదర్స్
పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించిన brs పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Koneru Konappa:అనుకున్నట్లే అయ్యింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి కారు పార్టీలో చేరారు. గత ఏడాది కాంగ్రెస్ లో పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల కిందట హస్తం దోస్తీకి కటీఫ్ చెప్పేశారు. తాను స్వతంత్య్ర అభ్యర్థిగానే ఉంటానని ప్రకటించిన ఆయన ఇప్పుడు బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన తమ్ముడు జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణా రావు ఇద్దరికీ పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానని చెప్పిన కోనప్ప తిరిగి అదే పార్టీలో చేరడం గమనార్హం.
గత ఏడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కోనేరు కోనప్ప.. ఏడాది కూడా పూర్తికాకముందే హస్తం దోస్తీకి కటీఫ్ చెప్పారు. కాగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన కోనేరు కోనప్ప.. ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన కారు పార్టీలో చేరడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, కేసీఆర్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని కోనప్ప చెప్పడంతో ఆయన ఖచ్చితంగా కారు పార్టీలోనే చేరుతారని పలువురు అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆయన బీఆర్ఎస్‌లో చేరారు.