ఆసుప‌త్రిలో క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించిన మోదీ

Prime Minister Modi: ఢిల్లీ కారు బాంబు పేలుడు బాధితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న మోడీ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఢిల్లీలోని ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేలుడు బాధితులను పరామర్శించారాయన. ఆస్పత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల బృందంతో సమావేశమై మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ప్రస్తుతం 16 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ప్రమాదంలో 12 మంది మృతి చెందగా… 24 మంది గాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఓ ఇంటర్నల్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం జరిగిన బాంబు పేలుడు విచారణను హోం మంత్రిత్వశాఖ మంగళవారం ఎన్‌ఐఏకి అప్పగించింది. నిఘా వర్గాలు దీన్ని ఉగ్రవాద దాడిగా భావిస్తూ ఉపా సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశాయి. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానితుడు ఫోటోను కూడా విడుదల చేశారు.

కాగా, ఎర్రకోట ఘటనపై భూటాన్ వేదికగా ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ ఘటనలో మరణించిన 12 మంది బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like