95 ఓటములు.. ఆయనకే అవార్డులు..
Rahul Gandhi’s 95 defeats:బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Election updates) ఎన్డీయే(NDA) కూటమి ప్రభంజనం సృష్టించింది. మూడింట రెండు వంతుల మెజారిటీతో దూసుకువెళ్లింది. ఏకంగా 200 స్థానాల వరకు గెలుచుకుంది. ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కూటమి(MGB) పూర్తిగా చతికిల పడిపోయింది. ఎక్కడా కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఘోర పరాభవం కావడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ (Rahul Gandhi) లక్ష్యంగా బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ భాజపా నేత చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.
రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 95 సార్లు ఓటమి చవిచూసినట్టు సూచించే ఓ మ్యాప్‌ను భాజపా నేత అమిత్ మాలవీయ(BJP leader Amit Malviya) ‘X’ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో 2004 నుంచి రాహుల్ కీలక స్థానాల్లో ఉన్నారు. నాటి నుంచి 2025 వరకు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్.. అనేక సార్లు విఫలమైందని, బీహార్‌లో మరో పరాభావం ఎదురయ్యిందని మాలవీయ అన్నారు. తాజా ఓటమితో ఆయన 95 సార్లు ఓడిన రికార్డును నెలకొల్పనున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులేవైనా ఉంటే.. అవి రాహుల్‌కే దక్కేవని వ్యంగాస్త్రాలు సంధించారు. రాహుల్ పరాజయాలను చూసి ఓటమి కూడా ఆశ్చర్యపోతుందని ఎద్దేవా చేశారు.